Bojja Rajashekar: ( senior journalist)
Telanganapolitics: ఆలు లేదు.. చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అనే రీతిలో తెలంగాణలో రాజకీయ పార్టీలు అధికారంపై కలలు కంటున్నాయి. ఎన్నికల నగరా మోగక ముందే గెలుపు మాదంటే మాదంటూ ఊదరగొట్టే ప్రసంగాలతో దంచేస్తున్నాయి. తెలంగాణలో రెండోసారి అధికారంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ మూడో సారి తామే గెలుస్తామని ధీమాలో ఉంది. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి అధికారంలోకి వస్తామని భావిస్తోంది. ఒకటి రెండు గెలుపులతోనే అధికారం మాకే దక్కుతుందన్న ఆశ బీజేపీలో కనిపిస్తోంది. తెలంగాణలో ప్రజలు ఎవ్వరికి పట్టం కడుతారో తెలియదు. కానీ అధికారం మాదేంటే మాదని రాజకీయ పార్టీలు కలలు కంటున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నాలుగు నెలల్లో జరుగనున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపుపై ధీమాతో కనిపిస్తున్నాయి. తమ వీపు తమకు కనబడదంటారు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిని, తిరుగబాటు తనం, సొంత పార్టీలో ఉంటూనే ఎదుటివారిపై అంతర్గత ద్వేషం పెంచుకోవడం.. పార్టీకి ద్రోహం చేసే పనులు చేస్తున్నారు.అధికారం వస్తే కుర్చీ నాకంటే నాకే కావాలనే ధోరణి రాజకీయపార్టీలను కలువర పెడుతున్నాయి. వీటన్నంటీకి భిన్నంగా అధికార పార్టీలో అవినీతి, టికెట్ల కోసం పోటీ పడే ఆశావాహుల సంఖ్య అధికం. అధికారం ఉందని ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేపట్టె అనాలోచిత పనులు, అవినీతి, ఆక్రమ దోపిడికి పాల్పడి ప్రజాకంఠకుడిగా మారుతున్నవారు ఉన్నారు. అంతేకాక బీఆర్ఎస్ చేపట్టిన అనేక సంక్షేమ పథకాల పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఐనా తిరిగి మరోమారు అధికారంలోకి రావాలని కేసిఆర్ ప్రభుత్వం భావిస్తోంది. అధికార పార్టీపై దుమ్మెత్తి పోసి అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదను పెడుతున్నాయి. కానీ నాలుగు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవ్వరికి అధికారం ఇవ్వనున్నారో మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
‘ బీఆర్ఎస్’ మేకపోతు గాంభీర్యం:
తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ 2014లో అధికారంలోకి రాగానే రాజకీయ పార్టీగా మారింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ప్రయత్నాల్లో భాగంగా పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ చేరికలు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా..తెలంగాణలో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. రెండు మార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్పై కొద్దిపాటి వ్యతిరేకత ఉండడం సహజమేనని అధికార పార్టీ భావిస్తుంది. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై నెలకొన్న వ్యతిరేకత, ఆవినీతి ఆరోపణలు ,వారు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలు అధికార పార్టీని అనేక నియోజక వర్గాల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కవితపై లిక్కరు స్కాం ఆరోపణలు చోటు చేసుకొవడం, మరో పక్క కుటుంబ పాలన అనే అపవాదు, రైతులకు రూ.లక్షరుణమాఫీ అందకపోవడం, ధరణిలో ఏర్పడిన చిక్కులను పరిష్కంచకపోవడం, కారు ఓవర్ లోడు కావడం, సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అమలుకాకపోవడం లాంటి సమస్యలు అధికార పార్టీ గెలుపుకు అడ్డంకులుగా మారాయి. వీటన్నంటిని అధిగమించి మూడోసారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ తీసుకోచ్చె తాయిలాలు.. కేసిఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి!
నిబద్దతకు, నిజాయితీకి ప్రతీకగా ఉండే బీజేపీ నేడు ఫంక్తు రాజకీయ పార్టీగా మారింది. కుమ్ములాటలకు దూరంగా ఉండే పార్టీలో నేడు నేతలు ఒకరిపై మరోకరు విమర్శంచుకునే స్థాయిలో బీజేపీ ప్రయాణిస్తోంది. చివరకు పార్టీ అధ్యక్షుడిని తప్పించే పరిస్థితికి చేరుకుంది. ఒకటి రెండు విజయాలను చూసి వాపును బలుపుగా అనుకొని బోల్తా పడింది. ఈటల రాజేందర్ గెలుపు ఊపు తెస్తే రాజగోపాల్రెడ్డి ఓటమి పార్టీకి తిరోగమనానాకి నాంది పలికింది. కలహాల పార్టీగా బీజేపీ తెలంగాణలో కొనసాగుతున్న క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఏ మేరకు ప్రజల మద్దతు కూడగట్టుకుంటుందో చూడాలి మరి. మారిన కొత్త అధ్యక్షుడి పని తీరు మాజీ అధ్యక్షుడిని వ్యతిరేకించిన ఈటలకు సముచితమైన స్థానం లభించడం పార్టీకి ఏ మేరకు లాభం చే కూర్చుతాయో చూడాలి.