“ఉదయాస్తమయాలా! అవేంటి?”..

“ఉదయాస్తమయాలా! అవేంటి?”
అవును, నువ్వలా అడుగుతావని తెలుసు.
అందుకే,
‘రెండు మూడ్రోజులైనా ఉండేలా
మా ఊరికి రా! చూపిస్తా’
పని… పని… పని…
అది ఉన్నా లేకున్నా
పగలు, రాత్రి తేడాల్లేకుండా
పరుగులు పెడతూ
కృత్రిమ కాంతిలో
కుస్తీలు పట్టే నువ్వు…..
అర్థరాత్రి ఏ పన్నెండు తర్వాతో పడకెక్కి,
ఎటు తిరిగి ఆరేడు గంటల్ని
నిద్ర-మేల్కల నడుమ నలిపి, నలిగి
ఎవరో తరిమినట్టు…
బారెడు పొద్దెక్కాక నిద్దర లేచే నీకు..
అవెలా తెలుస్తాయి..? ఉహూ..తెలువవు!
స్విచాన్-స్విచాప్… విద్యుత్ చట్రంలో
ఇరుక్కున్న నీకు
సాంద్రపు చీకటి వెలుగులే తెలుసు,
వాటి నడుమ ఉండే ‘మసక’
గడుల వాసన కూడా తెలీదు!
మా ఊళ్ళో…..
చుక్కల నిఘాలో,
రాత్రంతా రాజ్యమేలే చిక్కటి చీకటికి,
సూరీడు చూపుల్తో,
భళ్ళున తెల్లారి విరగపూసే వెలుగులకీ
నడుమ
తూర్పు తలుపు తెరచుకోవడం,
చిరుగాలి తెమ్మెరలు నడక నేర్వడం,
తొలిపొద్దు పొడచూపే సంకేతం,
వడివడిగా భానుడు కొలువుకెక్కడం…
ఇలా కాలం మసక మసగ్గా మొదలై
రంగులు మార్చే రసవత్తర ఘట్టం!!
చూపిస్తా మా ఊరికి రా!
ఓ పన్నెండు గంటలు గడిచాక…
ఉల్టా ఉంటుంది కానీ, అచ్చు ఇలాంటిదే
ఇంకో సోయగం…. అది ‘సాయం సంధ్య’
అదీ చూపిస్తా! తప్పక రా,
మరిచిపోవద్దు, మా “నాగరిక”

=================

ఆర్ .దిలీప్ రెడ్డి

 ( ఏడేళ్ల నాటి యాది.. ఫేస్ బుక్ జ్ఞాపకం )

 

Related Articles

Latest Articles

Optimized by Optimole