క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు ‘ మిస్టర్ ఐపీఎల్ ‘ రిటైర్మెంట్..

భారత క్రికెట్ అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘మిస్టర్ ఐపీఎల్ ‘ సురేష్ రైనా క్రికెట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్నీ రైన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించాడు.దేశానికి.. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని.. తనకు ఎల్లవేళలా అండగా నిలిచిన  బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి .. రాజీవ్‌ శుక్లా సర్‌కి.. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రైనా ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

ఇక 2020 లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రైనా..  ఐపీఎల్‌లో మాత్రం ఆడుతూ వస్తున్నాడు. గత సీజన్ వేలంలో ఏ ఫ్రాంచైజీ అతనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో అదే సిజన్లో రైనా కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. 

కాగా రైనా ఐపీఎల్ ప్రారంభం నుంచి… 11 సీజన్‌లలో చెన్నైసూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.రెండేళ్ల పాటు ఆ జట్టు పై వేటు పడటంతో… గుజరాత్‌ లయన్స్‌కు టీంకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.  చెన్నై అభిమానులు అతనిని ప్రేమతో చిన్నతల గా పిలుస్తారు. 

ఇదిలా ఉంటే మిస్టర్‌ ఐపీఎల్‌ పేరున్న రైనా.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. మొత్తం 205 మ్యాచ్‌లు ఆడిన అతను.. 5 వేల 528 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో రైనా 226 వ‌న్డేలు ఆడి 5, 615 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 36 అర్ధసెంచరీలు ఉన్నాయి. అంతేకాక  మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన  ఆటగాళ్ల జాబితాలో రైనా చోటు సాధించాడు.