విశీ: బిడ్డ పుట్టగానే స్త్రీ తల్లి అవుతుంది. ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటుంది. బాల్యం దాటి, యవ్వనంలోకి అడుగుపెట్టి, ప్రపంచాన్ని విస్తృతం చేసుకుంటూ ముందుకు సాగి, ఇంకా ఇంకా మరెన్నో సాధించాలనే తపనతో ఉన్నప్పుడు తల్లులు ఇంకా తల్లులుగానే ఉంటారు. తల్లితనాన్నే ఆస్వాదిస్తూ, ఒకానొక దశ తర్వాత ఆ తల్లితనంలోనే చిక్కుకుపోతుంటారు. రాముడు అంతఃపురం దాటి, మిథిల చేరి, ఆపై అడవులకు వెళ్ళి, రావణ సంహారం చేసినా అతను కౌసల్య తనయుడే! రాజమాత అక్కడే మిగిలింది. అక్కడే ఒదిగిపోయింది. ఇది తరతరాల చరిత్ర.
2000 సంవత్సరం ఎలాంటి కాలం! కొత్త శతాబ్దానికి అడుగు పడ్డ కాలం. అప్పటిదాకా ధనిక వర్గాలకే పరిమితమైన విదేశీయానం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకూ చేరువైన కాలం. అమెరికా ఉద్యోగం పరమావధిగా, అక్కడ స్థిరపడటం జీవితాశయంగా యువత ప్రయాణం కట్టిన కాలం. భార్యాభర్తలు అక్కడికి వెళ్లి, అక్కడే పిల్లల్ని కని వారిని ఆ దేశపౌరులుగానే పెంచడాన్ని ఆనందిందిన కాలం. అటువంటి సమయంలో నటి రేవతి ఒక కథ రాసుకుని దాన్ని తెరకెక్కించారు. దక్షిణాది భాషల్లో దర్శకురాలిగా మారిన అతి తక్కువ మంది నటీమణుల్లో ఆమె ఒకరు. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రమే ‘మిత్ర్ మై ఫ్రెండ్’. ఏంటి కథ?
తల్లీ కూతుళ్ళ మధ్య విభేదాలు. నా గురించి నేను చూసుకోగలను అనే కూతురు. నీకోసం నేనున్నాను అనే తల్లి. నిజానికి అవి రెండు సంస్కృతుల మధ్య తేడాలు. భారతీయ సంస్కృతిలో పెరిగి అమెరికాలో స్థిరపడ్డ తల్లికి, అమెరికాలో పుట్టి, అక్కడి సంస్కృతినే తనదిగా చేసుకున్న కూతురికి మధ్య తేడా! అతి మామూలు అంశమే, కానీ అంతర్గతంగా అనేకమంది తల్లులు నాడూ నేడూ అనుభవిస్తున్న మానసిక ఇబ్బంది ఇది. సొంతవాళ్లని వదిలి దూర దేశం వచ్చిన మహిళకు చెప్పుకోదగ్గ మిత్రులంటే భార్య, కూతురు. భర్త ఉద్యోగంలో, కూతురు చదువులో మునిగి ఎవరి Privacyని వారు ఏర్పాటు చేసుకున్నాక ఆ తల్లి ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి తలుపు తట్టాలి? ఆమె సాంకేతికత అనే తలుపు తట్టింది. నెట్టింట అడుగు పెట్టింది. ఆపైన?
ఈ సినిమాకు అనేక విశేషాలు ఉన్నాయి. అప్పటికి 32 ఏళ్ల వయసున్న నటి శోభన చేత 16 ఏళ్ల కూతురున్న తల్లి పాత్ర చేయించారు. 98 శాతం సినిమాను అమెరికాలోనే షూట్ చేశారు. ప్రస్తుత దర్శకురాలు సుధ కొంగర ఈ సినిమాకు రచనా సహకారం అందించారు. సందర్భానుసారం సినిమాలో ఇంగ్లీషు, తమిళ డైలాగులు వాడారు. ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులందరూ స్త్రీలే కావడం అసలైన విశేషం. ఇళయరాజా గారి కుమార్తె భవతారిణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫౌజియా ఫాతిమా సినిమాటోగ్రఫీ చేపట్టగా, బీనా పౌల్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను తెలుగులోనూ అనువదించారు.
కూతురు తనకు మానసికంగా దూరమవుతున్న బాధను తన నటనలో అద్భుతంగా చూపారు నటి శోభన. ఆమె భర్తగా బాలీవుడ్ నటుడు నాజర్ అబ్దుల్లా నటించారు. చిత్రంలో శోభనకు నటి సరిత డబ్బింగ్ చెప్పగా, నాజర్ అబ్దుల్లాకు నటుడు సురేశ్ గాత్రదానం చేశారు. లక్ష్మి అనే పాత్రలో శోభన నటన చూసి తీరాలి. చారడేసి కళ్లతో లయబద్దంగా నాట్యం చేసే ఆమె, మానసిక వేదనతో కుమిలిపోయే తల్లిగా నటించి మెప్పించారు. 2002లో జాతీయ ఉత్తమ నటిగా అబ్దుల్ కలాం గారి నుంచి పురస్కారం అందుకున్నారు. ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమా ఇది. అయితే ఇందులో తన వయసుకు మించిన పాత్ర చేశానని, ఆ తర్వాత నుంచి పాత్రల ఎంపికలో జాగ్రత్తపడుతూ ఉన్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ సినిమా చూడండి. శోభన గారి నటన కోసం చూడండి. 2002లోని అమెరికాను, అక్కడి మనస్తత్వాలను గమనించండి. అన్నింటినీ మించి అమెరికా చేరిన అమ్మలు ఒంటరితనంతో పడుతున్న ఇబ్బందులు తెలిసేందుకు చూడండి.
ఈ సినిమా యూట్యూబ్‌లో తెలుగులో అందుబాటులో ఉంది..
https://youtu.be/VViVnGUCEvs