Telangana: సీఎం రేవంత్ నాయకత్వాన్ని అస్థిరపరిచే కుట్ర: పటేల్ రమేష్ రెడ్డి

Telangana:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆరోపించారు. వికారాబాద్ లగచెర్ల లో కలెక్టర్ పై దాడి వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. శుక్రవారం గాంధీభవన్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. పట్నం నరేందర్ రెడ్ది అమాయక ప్రజలను రెచ్చగొట్టారని.. కేటీఆర్ డైరెక్షన్లోని కుట్ర జరిగిందని.. అధికారులను చంపేందుకు సైతం  బిఆర్ఎస్ నాయకులు కుట్ర చేశారని ధ్వజమెత్తారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రాష్టం అధోగతి పాలయిందని.. రైతుల అవస్థలను కళ్లారా చూశానని ఉద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన  హామీ మేరకు రుణ మాఫీ చేసిందని.. తమది రైతు ప్రభుత్వమని రమేష్ రెడ్డి తేల్చి చెప్పారు.

సీఎం రేవంత్ నాయకత్వంపై తెలంగాణ ప్రజలు విశ్వాసంగా ఉన్నారని పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పాలనలో మేం అడ్డుకోవాలనుకుంటే ప్రాజెక్టు కట్టేవారా అని ప్రశ్నించారు. పనిగట్టుకొని మరి కేటిఆర్ – హరీష్ రావు కలిసి ప్రభుత్వంపై దుమ్మత్తి పోసే కార్యక్రమం పెట్టుకున్నారని అన్నారు. ఏడాది పూర్తి కావొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ ఏ మాత్రం చెక్కుచెదరలేదని తేల్చిచెప్పారు.

బిఆర్ఎస్ పార్టీలో నాయకత్వ కుర్చీ కోసం కొట్లాట జరుగుతోందని.. త్వరలోనే హరీష్ రావు వేర్ కుంపటి పెట్టడం ఖాయమని పటేల్ రమేష్ రెడ్డి జోస్యం చెప్పారు. ఫాం హౌస్ కే పరిమితమైన కేసిఆర్ కు మరో పదేళ్ల వరకు విశ్రాంతి ఇవ్వాలన్న నమ్మకం తెలంగాణ ప్రజల్లో బలపడుతోందని తెలిపారు. ఏడాదిలోనే 90 శాతం వరకు హామీలను నెరవేర్చామని.. రానున్న రోజుల్లో మిగిలిన హామీలను అమలు చేసి తీరుతామని పటేల్ రమేష్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.