Raparthy vinod Kumar : తెలంగాణ లో ఒక్క ఘటనతో రాష్ట్ర రాజకీయాలు అమాంతంగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కులగణన ఓవైపు …. మరోవైపు ఫార్మా సిటీ పేరుతో వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో భూముల సేకరణకు వెళ్లిన కలెక్టర్ పైదాడి ఘటనలు గత వారం రోజులుగో పేపర్లో హెడ్ లైన్స్ గా, టీవీలో బ్రేకింగ్ న్యూస్ లు అయ్యాయి. కలెక్టర్ నాపై దాడి జరగలేదని చెప్పిన.. ఈ అంశాన్ని రాజకీయం చేస్తూనే ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలు తలా తిలకెడు తీల పాపం అన్నట్లు ఈ ఘటనపై రోజుకో విధంగా స్పందిస్తున్నాయి. ఈ దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని అధికార పార్టీ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్టు చేసింది. ఇక్కడి వరకు బానే ఉంది. కానీ ప్రభుత్వం ఈ రెండు ఘటనల పైనే ఫోకస్ పెట్టిందా…? రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేవా..? రాష్ట్రంలో చాలా చోట్ల ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా చేయడం లేదని, అడ్డికి పావుశేరు చొప్పున మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్ గురుకుల విద్యార్థులకు సన్నబియ్యం పెడతామని చెబుతుంది. మరోవైపు విద్యావ్యవస్థను గాడిలో పెడతామని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన తప్పును సరిదిద్దుతున్నామని అంటోంది. అయితే గురుకులాల్లో అడపాదడపా ఫుడ్ ఫాయిజన్, వివిధ సమస్యలతో విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయాన్ని మర్చిపోతోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాది దగ్గరకు కావొస్తున్నా పాలన ఇంకా గాడిలో పడలేదని..ఆయా శాఖల మధ్య సమన్వయం లోపించిందనే విషయాన్ని మంత్రుల మాటలతో ఎన్నో సార్లు రుజువైంది. సమగ్ర కుటుంబ సర్వే పేరిట జరుగుతున్న సర్వేలో తమ వ్యక్తిగత వివరాలను అడుగుతున్నారని.. దీంతో వస్తున్న పథకాలు పోయే అవకాశాలు ఉన్నాయంటూ ప్రజలు ఎన్యూమరేటర్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అనుమానాలను నివృత్తి చేయాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు తమకేం పట్టన్నట్టు వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ నాయకులు లగచర్ల ఘటనలో అమాయక యువకులు, రైతులను అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికార ప్రభుత్వం మాత్రం మేం రైతులను, యువకులను అరెస్టు చేయలేదని కేవలం కలెక్టర్ పై దాడికి యత్నించిన వారినే అరెస్టు చేశామని చెబుతోంది. వీరిద్దరి మధ్యలో మాకో ఆయుధం దొరికిందని బిజెపి నాయకులు దాడిని ఖండిస్తున్నామని స్టేట్ మెంట్స్ ఇచ్చి, బాధితులతో మాట్లాడుతున్నామని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.
హైడ్రా, ఫార్మాసిటీ భూముల కేటాయింపు, విగ్రహాల మార్పు, ఇవి కాదుకదా ప్రజలకు కావాల్సింది. ప్రభుత్వ అధికారిపై దాడి హేయమైన చర్య ఇది ఎవ్వరు కాదనలేని సత్యం. కానీ ఈ ఒక్క ఘటనతోనే విపక్ష నాయకులను ఇరుకున పెడతామనే ప్రభుత్వ మొండి వైఖరి, మాత్రం మూమ్మాటికి తప్పే. గత పదేళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీస్తామంటూ ఎందుకు వెనక్కి తగ్గుతున్నారో ప్రభుత్వ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై అవినీతిపై విచారణ ఏదీ..? కాంగ్రెస్ ఎన్నికలో సమయంలో ఇచ్చిన హామీల అమలు ఏదీ..? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను తప్పు పడుతున్న కాంగ్రెస్… తిరిగి తాము అదే తప్పు చేస్తున్నామన్న విషయాన్ని దాట వేస్తున్నారనేది సగటు ప్రజల ఆవేదన. 10 ఏళ్ల కేసీఆర్ పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మార్పు కావాలని కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెడితే సామాన్య ప్రజలపై దాష్టీకాలతో, నాయకులపై విమర్శలు, ప్రతి విమర్శలతో కాలం వెల్లదీస్తుందే తప్ప ఇప్పటి వరకు ప్రజలకు చేసింది శూన్యం. ఆరు గ్యారెంటీల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పుడు ఉచిత బస్సు తప్ప మిగిలిన ఏ హామీలు అమలు కావడం లేదన్నది ప్రజల మాట. ఓ మంత్రి మాట్లాడుతూ త్వరలో బాంబ్ లు పేలుతాయ్, ఆటం బాంబ్ పేలుతాయన్నారు. దాంతో ప్రజలకేమైనా ఉపయోగం ఉందా..? రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేయాల్సింది పోయి గతంలో వాళ్లు కొండను మింగారు… మేం ఏదుంటే అదే మింగుతాం ప్రజా సంక్షేమం, పాలన గాడి తప్పిన ఫర్వాలేదన్నట్టు అధికార కాంగ్రెస్ యంత్రాగం వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరం.
క్షేత్ర స్థాయిలో సమస్యలను అర్థం చేసుకుని ప్రజలకు మెరుగైన పాలన అందిస్తే ప్రజలే అక్కున చేర్చుకుంటారన్న చిన్న విషయాన్ని పాలకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు విస్మరించడం ప్రజలను ఒకింత బాధకు గురి చేస్తుందనేది కాదనలేని నిష్టుర సత్యం.