ఏపీలో ప్రభుత్వం మారితే..ఇంతకంటే గొప్పగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు. రాష్ట్రంలోని ప్రజలకు.. రాజ్యాంగంలో 14 నుంచి 22వ అధికరణ లో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే.. వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలన్నారు. ఎలుకల్లా అధికారంలోకి వచ్చినవారు.. పందికొక్కుల్లా మారి ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.
పతనం అంచున పోలీస్ ప్రభుత్వం..
పతనం అంచుల్లో ఏపీ పోలీసు ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు రఘురామకృష్ణంరాజు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందన్నారు. గతంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ని..మాస్క్ పెట్టుకోలేదని మరోక వ్యక్తి ని ఈ పోలీసు ప్రభుత్వం హత్య గావించిందని ఆరోపించారు. అధికార పార్టీ ఎంపీని పోలీసు కస్టడీలో చితకబాదడంతో పోలీసుల దమన కాండ పరాకాష్టకు చేరుకుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి, ఇప్పుడు 1861 పోలీసు చట్టానికి వక్ర భాష్యం చెబుతూ చీకటి జీవోను తీసుకువచ్చారని రఘురామ విమర్శించారు.
ప్రభుత్వం సమాజానికి ఇస్తున్న సంకేతం ఏమిటి?ప్రధాన ప్రతిపక్ష నేత, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబును సొంత నియోజవర్గమైన కుప్పం వెళ్లనివ్వకుండా రోడ్డుపైనే కూర్చోబెట్టి స్థాయికి పోలీసు గూండాలు దిగజారారని రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు . ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దారుణం మరోటి ఉండబోదన్నారు. ఇలాగే విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సైతం హోటల్ గదికే పరిమితం చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రోడ్డు షో కోసం వినియోగించే వాహనాన్ని సీజ్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వం సభ్య సమాజానికి ఇస్తున్న సంకేతం ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.