మునుగోడు రాజకీయ పండగ .. సభలతో హోరిత్తిస్తున్న పార్టీలు!

మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలు పాదయాత్రలు , సభలు సమావేశాలతో ప్రచారాన్ని హోరిత్తిస్తున్నారు. ఈక్రమంలోనే అధికార టీఆర్ఎస్ బహిరంగ సభతో కార్యకర్తలు జోష్ నింపింది. బీజేపీ సైతం ఆదివారం నిర్వహించనున్న బహిరంగ సభకు కార్యకర్తలు సమాయత్తమవతున్నారు. అటు కాంగ్రెస్ ప్రతి గడపకు వెళ్లి ఓటర్ల కాళ్లకు దండపెట్టి ఓట్లు అడుగుతామంటూ ప్రచారాన్ని మొదలెట్టింది. దీంతో మునుగోడులో రాజకీయ పండగ వాతావరణం కనిపిస్తోంది.

ఆగమాగం కావొద్దు..

ఇక మునుగోడు ప్రజాదీవెనలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షపార్టీలను ఏకిపారేశాడు. జరిగేది ఉప ఎన్నిక కాదు.. బతుకు దెరువు ఎన్నిక సరికొత్త స్లోగన్ తో కార్యకర్తల్లో జోష్ నింపారు.కొట్లాడటం కొత్త కాదన్న ముఖ్యమంత్రి.. తెలంగాణ కోసం యాడ దాకైనా కొట్లాడేందుకు సిద్ధమని ప్రకటించారు.ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దని.. సంక్షేమం కోసం ఉప ఎన్నిక వచ్చిందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు.బాయికాడ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్ర కుట్ర చేస్తోందని..తాను బతికున్నంత వరకు మీటర్లు పెట్టడని జరగదని సీఎం స్పష్టం చేశారు.

గెలుపే లక్ష్యంగా మునుగోడు సమరభేరి..

అటు బీజేపీ నేతలు ‘మునుగోడు సమరభేరి’ సభకు ఏర్పాట్లను పూర్తి చేశారు. సభకు కేంద్ర హోమంత్రి అమిత్ షా చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన అనుచరులు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న నేపథ్యంలో భారీజనసమీకరణకు నేతలు ప్లాన్ చేశారు. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా కమలం నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతుండటంతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆవివరాలను అమిత్ షాకు తెలియజేయనున్నారు. సభ అనంతరం శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరపనున్నారు.

గుణపాఠం చెప్పాలి..

కాగా కాంగ్రెస్ నేతలు రాజీవ్‌ గాంధీ జయంతి సదర్భంగా.. జెండా ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం పోర్లగడ్డ తండాలో ఇంటింటిప ప్రచారం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు అమ్ముడుపోతున్నారని.. వాళ్ళకు గుణపాఠం చెప్పాలని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపు నిచ్చారు. కోదండరాం కూడా కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలబడాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

మొత్తంమీద మునుగోడులో దసరా పండగ కంటే ముందు రాజకీయ పండగ హాడావుడి కనిపిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో.. కారు పార్టీ బహిరంగ సభతో కార్యకర్తల్లో ఉత్సహం నింపగా.. హస్తం పార్టీ గడపగడపకు ప్రచారం పేరిట వలసలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాయి. అయితే మునుగోడు సమరభేరి సభ తర్వాత మరిన్ని బీజేపీలోకి మరిన్ని వలసలు ఉంటాయని కాషాయం నేతల కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.