రాష్ట్ర విభజన సమయంలోనే కుట్ర చేసిన జగన్: నాదెండ్ల మనోహర్

Janasena: ‘రాష్ట్రంలో ఎప్పుడూ అలజడులు జరగాలి… అశాంతితో ప్రజలు ఉండాలన్నదే జగన్ లక్ష్యం. అతడికి ఎల్లపుడూ అధికారం కోసం చేసే కుట్రలు, ఆలోచనలు మాత్రమే ఉంటాయి. ప్రజలకు మేలు చేయాలనే దృష్టి లేని నాయకుడు జగన్. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని చీల్చి, శాసనసభ్యులతో విడతలవారీగా రాజీనామాలు చేయించి, అభివృద్ధిని అడ్డుకోవాలని జగన్ చూశాడ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం శనివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన  నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ ‘ప్రజల కోసం పని చేసేదే ప్రజాస్వామ్యం. అనేక సందర్భాల్లో ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు నిజాయతీగా స్పందించే నాయకుడు ఉండాలి. ప్రజలు సైతం ప్రభుత్వంలో పాలుపంచుకోవాలి. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. అందుకు భిన్నమైన పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. గత నాలుగున్నర ఏళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న వెతలు వర్ణనాతీతం. మన ప్రాంత, బిడ్డల భవిష్యత్తు కోసం ప్రజలకు మేలు జరగాలి అని నిజమైన నాయకులు తపనపడతారు. ఈ ముఖ్యమంత్రి మాత్రం ఎప్పుడూ రాజకీయాలతో ముడిపెట్టి, అందరినీ ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారు. 151 స్థానాలు అందించిన వైసీపీకి రాష్ట్ర సంక్షేమం పట్టలేదు. జనసేన పార్టీ ప్రస్థానం సుస్థిరమైన అభివృద్ధి కోసం, కొత్త విధానంతో, ఏ పార్టీ చేయని విధంగా ప్రజలకు మేలు చేసేవిగా ఉంటాయి. అంచెలంచెలుగా జనసేనలో నా ప్రయాణం  పవన్ కళ్యాణ్  తో 5 సంవత్సరాలు పూర్తయింది. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం ఎలా అనేది  పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకున్నానని మనోహర్ పేర్కొన్నారు.

 

ప్రశ్నించే ధైర్యం ఇచ్చారు..

మన బిడ్డలు వేరే ప్రాంతానికి వెళ్లి బాధపడుతున్నారు.. యువతకు ఎందుకు భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నామని పవన్ కళ్యాణ్ ఎల్లవేళలా ఆలోచన చేస్తుంటారు. అలాంటి మన అధ్యక్షుల వారు ఈ ప్రస్థానంలో ఎన్నో మాటలుపడ్డారు. అవమానాలు ఎదుర్కొన్నారు. దేనికి వెరవకుండా మనలో ధైర్యం నింపారు. ప్రజాస్వామ్యయుతంగా ఎలా పోరాడాలో చక్కగా మనకు నేర్పించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఇచ్చారు. ఈ వైసీపీ దాష్టీకాలపై సామాన్యుడు పడుతున్న బాధలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేవలం ప్రశ్నించడమే కాకుండా, చైతన్యం నింపే విధంగా కార్యకర్తలను సిద్ధం చేసిన యోధుడు  జన సేనాని. ధర్మో రక్షతి రక్షిత: అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మన వెంటే ఉంటుందన్న నమ్మకాన్ని సూత్రాన్ని నమ్మిన నేత  పవన్ కళ్యాణ్. ఓ పార్టీని ముందుకు నడపడానికి ఆయన పడే కష్టం నాకు తెలుసు. పార్టీ ప్రస్థానంలో ఆయన వేసిన ప్రతి అడుగు ఓ మైలురాయి. ఆయన స్ఫూర్తితో జనసైనికులు, వీర మహిళలు చూపిన తెగువ అద్భతమని ఆయన కొనియాడారు.

 2014లోనే జగన్ బీజం వేశాడు..

రాష్ట్ర విభజన జరుగుతున్నపుడు నేను శాసనసభ స్పీకర్ గా ఉన్నాను. ఆ సమయంలో కేంద్రం నుంచి రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభం అయిందనే సమాచారం వచ్చిన దగ్గర నుంచి విభజన సమయంలో ప్రతి చర్చలో పాల్గొనే అవకాశం వచ్చింది. 292 అసెంబ్లీ సీట్లు, 42 లోక్ సభ స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ చీలిపోతుంటే ఎంతో వేదన అనుభవించాం. ఇందుకు సంబంధించిన విషయాలపై నేను, పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు చర్చించుకొని బాధపడ్డాం. అలాంటి విపత్కర స్థితిలో జగన్ రాష్ట్రం గురించి ఆలోచన చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చి జగన్ 25 మంది చేత విడతల వారీగా రాజీనామాలు చేయించారు. దఫాదఫాలుగా ఎన్నికలు వచ్చేలా చేస్తే అభివృద్ధి పనులు ఆగిపోతాయనే కుట్రపూరితంగా ఆలోచన చేశాడు.  విడతల వారీగా ఉప ఎన్నికలు జరగాలనే తలంపుతో ఎలక్షన్ కోడ్ వల్ల రాష్ట్ర అభివృద్ధి జరగకుండా జగన్ అప్పట్లో పన్నాగం పన్నారని మనోహర్ ఆరోపించారు.