మాచర్ల హింస ఘటనను ఖండిస్తున్నామన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఇది అప్రజాస్వామికని… ఈ ఘటనను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉందన్నారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాన్ని అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. వైసీపీ శాశ్వత అధికారం లక్ష్యంతో ఈ విధంగా ముందుకు వెళ్తోందని దుయ్యబట్టారు. ఘర్షణ వాతావరణం సృష్టించడం.. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం.. ప్రైవేటు ఆస్తులపై, వ్యక్తులపై దాడులు చేయడం ఎంత మాత్రం సరి కాదని మనోహర్ తేల్చిచెప్పారు
రైతుల్లో భరోసా నింపేందుకు సభ..
ఇక పోలీసులు ఇలాంటి ఘటనలను అడ్డుకోవాల్సిన ఆవసరం ఉందన్నారు. సత్తెనపల్లిలో రైతు భరోసా సభ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. రైతుల్లో భరోసా నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి.. పోలీసులు కూడా సహకరించాలని కోరుతున్నామన్నారు. గుంటూరు జిల్లాలో ఊహించిన దానికంటే కౌలు రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయన్నారు. సుమారు 280 మందికి పైగా కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయాల్సి ఉందని.. పల్నాడు ప్రాంతంలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే ఆ ప్రాంతంలో కార్యక్రమం ఏర్పాటు చేశామని వెల్లడించారు.
సభను అడ్డుకునేందుకు కుట్రలు..
ఇదిలా ఉంటే.. రైతుల శ్రేయస్సు కోసం సభ పెడుతుంటే.. అప్పుడే కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు మనోహర్. జీపుల్లో వెళ్లొద్దు.. బస్సుల్లో వెళ్లొద్దు అంటూ ఆంక్షలు పెడుతున్నారన్నారు. లబ్దిదారుల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు మొదలు పెట్టారన్నారు. జనసేన నుంచి లక్ష తీసుకొంటే.. ప్రభుత్వం ఇచ్చే ఏడు లక్షలు పోతాయని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని జిల్లాల మాదిరి ఇక్కడ కూడా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు మొదలు పెట్టారన్నారు. గ్రామాల్లో రైతుల కుటుంబాలకు బెదిరింపులు కూడా మొదలైనట్టు తమ దృష్టికి వచ్చినట్లు మనోహర్ చెప్పుకొచ్చారు.