నాగ్ అశ్విన్ నిర్మాతగా ‘ జాతిరత్నాలు’

మొదటి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. రెండో చిత్రం ‘మహానటి’తో ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకొని దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక మూడో చిత్రం తన మామగారు అశ్వినిదత్ ప్రతిష్టాత్మక బ్యానర్ ‘వైజయంతి మూవీస్ బ్యానర్’ 100 వ చిత్రంగా రెబల్ స్టార్ ప్రభాస్తో తీస్తున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ రెండు పార్టులు, ‘సాహో’తో ప్యాన్ ఇండియా హీరోగా పేరుతెచ్చుకున్న ప్రభాస్ తో అశ్విన్ కలయికలో సినిమా అనౌన్స్ చేసినపటి నుంచి అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అశ్విన్ దర్శకుడిగా మాత్రమే కాకుండ నిర్మాతగా మారి స్వప్నదత్ సినిమాస్ పేరుతో అనుదీప్ దర్శకత్వంలో ‘ జాతి రత్నాలు ‘ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శితో పాటు ‘ఏజెంట్ సాయి ఆత్రేయ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి, తదితర నటీనటులు నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటి కీర్తిసురేశ్ గెస్ట్ రోల్ కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. చిత్రాన్ని మార్చి నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చిత్రానికి బాణీలను రధన్ సమకూరుస్తున్నాడు.