Nagulachavithi: కార్తీక మాసం శివకేశవులకు మాత్రమే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి విశిష్టమైంది. ఈ మాసం కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలో శుద్ధ చవితి నాడుసుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి. ఈ రోజును నాగుల చవితి.. మహా చతుర్థి అని కూడా అంటారు. నాగదేవతకు దీపారాధన చేసి, ఆవు పాలు పుట్టలో పోసి చలిమిడి, నైవేద్యం సమర్పిస్తారు.సంతానం కోసం ప్రార్ధించే వాళ్లు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే మేలు జరుగుతుందని శాస్త్ర వచనం సూచిస్తున్నది.
నాగేంద్రుని మంత్రాన్ని స్మరిస్తూ పుట్టలో పాలు పోయాలి..!
పాహి పాహి సర్వరూప నాగదేవ దయామయ !
సత్సంతాన సంపత్తిం! దేహిమే శంకర ప్రియా !
అనంతాది మహానాగరూపాయ వరదాయచ!
తుభ్యం నమామి భుజగేంద్ర! సౌభాగ్యం దేహిమే సదా!
శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!
శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం!
నాగుల చవితిని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తే సర్వ గోపాలు పోతాయి. రాహు కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కాని కన్యలకు శీఘ్ర వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుబాము అని అంటారు. మూలాధార చక్రంలో పాము ఆకారమువలే ఉండి.. మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ.. కామ,క్రోధ,లోభ, మోహ, మద మాత్సర్యాలనే విషాన్ని కక్కుతూ ఉంటుంది. మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి నాగేంద్రుడికి పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం.. శ్వేతత్వం పొంది శ్రీ మహావిష్ణువు నివసించే శేషపాన్పుగా మారుతుందని పురాణ వచన.
కుజ, రాహు గ్రహ దోషాలు ఉన్నవారు కార్తీక మాసంలో వచ్చే షష్టి, చతుర్దశి లలో మంగళవారం లేదా బుధవారం దినమంతా ఉపవాసం ఉండి నాగపూజ చేయాలి. ఇలా చేస్తే పామును చంపిన వారికి పాప పరిహారం తో పాటు .. ఆ పాపం వంశానికి తగలకుండా ఉంటుందని శాస్త్రం చెబుతుంది.