Maharashtraelections: సామాజికవర్గాల చుట్టూ ‘మహా’సంగ్రామం..!

Maharashtra elections 2024:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఎమ్వీఏ’ కూటముల రాజకీయాలు సోషల్ ఇంజినీరింగ్లో భాగంగా కులాల చుట్టే తిరుగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీకి వెనుదన్నుగా ఉంటున్న సామాజికవర్గానికి వ్యతిరేకంగా ఉండే ఇతర కులాల ఓట్ల సమీకరణపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో అధికారాన్ని శాసించే స్థాయిలో ఉన్న ఓబీసీ, మరాఠా సామాజికవర్గాల కటాక్షం కోసం పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తూనే, ఏ అవకాశాన్ని జారవిడుచుకోవద్దనే లక్ష్యంగా తక్కువ సంఖ్యలో ఉన్న కులాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడంతో భిన్న సామాజికవర్గాలకు కేంద్రమైన మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి.

ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ సామాజికవర్గం బీజేపీకి వ్యతిరేకంగా ఉండడంతో ఆ పార్టీకి ఓటమి తప్పదని భావించినా, బీజేపీ మైక్రో లెవల్లో జాట్లకు వ్యతిరేకంగా ఓబీసీ సామాజికవర్గం ఓట్లను కూడగట్టుకొని ఊహించని విధంగా విజయం సాధించింది. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫార్ములాను బీజేపీ ప్రయోగిస్తోంది. 30 శాతానికిపైగా ఉన్న మరాఠాలు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతూ అన్ని ఎన్నికల్లోనూ ఆ సామాజికవర్గం అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుస్తున్నారు. మహారాష్ట్రలో బలమైన మరాఠాలు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఉద్యమించడంతో రాష్ట్ర రాజకీయాల్లో పలుమార్పులు సంభవించాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై హామీ ఇచ్చిన బీజేపీ మాట తప్పిందనే ఆగ్రహంతో 2024 లోక్సభ ఎన్నికల్లో వీరు కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఎమ్వీఏ’ను ఆదరించారు. దీంతో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠాలకు ప్రత్యామ్నాయంగా 50 శాతానికిపైగా ఉన్న ఓబీసీ సామాజికవర్గాల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు మరాఠాల పేరుతో ఓట్లు చీలకుండా ఉండేందుకు ‘ఓట్ జిహాద్’ పేరుతో ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ హిందువుల ఓట్లు ఏకపక్షంగా పొందేందుకు కూడా బీజేపీ ప్రయత్నిస్తుంది.
రాష్ట్రంలో బీజేపీకి మొదటి నుండి ఓబీసీల్లో ఆదరణ ఉంది. ‘మాధవ్’ ఫార్ములాతో ఓబీసీ సామాజికవర్గంలో అధికంగా ఉన్న మాలి, ధంగర్, వంజారీ సామాజికవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి దగ్గరైంది. 2009 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 42 శాతం, 2009 పార్లమెంట్ ఎన్నికల్లో 47 శాతం, 2014లో పొత్తు లేకుండా పోటీ చేసిన బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 34 శాతం, పార్లమెంట్ ఎన్నికల్లో 37 శాతం, 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 48 శాతం ఓట్లు రాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 75 శాతం ఓబీసీ ఓట్లు బీజేపీ కూటమికి వచ్చాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల చీలికతో మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించినా బీజేపీ కూటమి 50 శాతానికిపైగా ఓబీసీ ఓట్లను తెచ్చుకొని ఆ సామాజికవర్గంలో తన పట్టు సడలలేదని నిరూపించుకుంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓబీసీ ఓట్లపై భారీగా ఆశలు పెట్టుకున్న బీజేపీ మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం వ్యతిరేకతను ఓబీసీల ఓట్లతో అధిగమించవచ్చని భావిస్తోంది.

లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 17 స్థానాలే గెలిచిన ‘మహాయుతి’ కూటమి ప్రత్యేకించి బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగానే సన్నాహక చర్యలు ప్రారంభించినట్టు క్షేత్రస్థాయిలో ఎన్నికలను పరిశీలిస్తున్న ‘పీపుల్స్ పల్స్’ బృందం దృష్టికి వచ్చింది. ఇందులో భాగంగా 175కు పైగా నియోజకవర్గాల్లో మైక్రో ఓబీసీ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని బీజేపీ పెద్దఎత్తున చేపట్టింది. దీనికి ఆర్ఎస్ఎస్ కూడా సహాయసహకారాలు అందిస్తోంది. ఓబీసీల ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ ‘మాధవ్’ ఫార్ములాకే పరిమితం కాకుండా ఓబీసీలో మరిన్ని కులాలకు చేరువయ్యేందుకు చర్యలు చేపట్టింది. గుర్తింపు లేని చిన్నచిన్న సామాజికవర్గాలను ఆకర్షించేందుకు మహాయుతి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్ర సరిహద్దులో 70కి పైగా అసెంబ్లీ సెగ్మంట్లు ఉండడంతో అక్కడి సామాజికవర్గం ఓటర్లపై కూడా బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఏడు కొత్త కులాలను ఓబీసీ జాబితాలో చేర్చి, క్రిమీ లేయర్ సీలింగ్ను 8 లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయలకు పెంచింది. దీంతో లోద, బడా గుజార్, సుర్యవంశీ గుజార్, దంగారీ, రేవ్ గుజార్, మున్నార్ కాపు, తెలంగి సామజికవర్గాలకు లబ్ది చేకూరింది.
మరాఠా సామాజిక వర్గం ఓట్లు వ్యతిరేకంగా పడుతాయని భావిస్తున్న బీజేపీ ఓబీసీలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రాష్ట్ర రాజకీయాలు మరాఠా వర్సెస్ ఓబీసీలుగా మారబోతున్నాయి. ప్రత్యేకించి 62 స్థానాలున్న విదర్భలో ఈ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో కుంభి- దళిత- ముస్లిం ఓటు బ్యాంక్పై ఎమ్వీఏ కూటమి ఆశలు పెట్టుకోగా, తెలి- బంజార- బోవిర్- కోమిటి- సానార్- గోండ్ సామాజికవర్గాలతో పాటు మరో రెండు డజన్ల ఓబీసీ కుటాల ఓట్లపై మహాయుతి భరోసాగా ఉంది.

రాష్ట్రంలో 7 శాతానికిపైగా ఉన్న ధంగర్ (గొర్రెకాపరులు) సామాజికవర్గానిది ఓబీసీలో కీలకం. ‘మాధవ్’ ఫార్ములాతో ఈ సామాజికవర్గంలో తిరుగులేదని బీజేపీ భావిస్తున్న వాస్తవ పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి. గతంలో వీరికి ఎస్టీ హోదా ఇస్తామని హామీ ఇచ్చిన మహాయుతి నెరవేర్చకపోవడంతో మరాఠాలో ఏర్పడినట్టు ఈ సామజికవర్గంలో కూడా బీజేపీపై అసంతృప్తి నెలకొంది. ధంగర్ సామాజికవర్గంలో పలుకుబడి ఉన్న రాష్ట్రీయ సమాజ్ పకాశ్ (ఆర్ఎస్పీ) అధ్యక్షులు మహాదేవ్ జంకర్ మహాయుతిని వీడడం ఈ కూటమికి నష్టదాయకమే. ఈ సామాజిక వర్గం ప్రభావం పశ్చిమ, ఉత్తర మహరాష్ట్రలో ప్రత్యేకించి విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో ఉండడంతో మహాయుతికి ఇబ్బందికర పరిస్థితులు తప్పకపోవచ్చు. ఓబీసీల్లో కొంత కుంబీలు, హిందూయేతర సామాజికవర్గాలు వారు కూడా ఉన్నారు. వీరు బీజేపీకి ఏమేరకు సహకరిస్తారో సందేహమే.

ప్రస్తుత పరిస్థితుల్లో మహారాష్ట్రలో మరాఠా, ఓబీసీ ఓట్లు కలిసికట్టుగా ఒక కూటమికి పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మరాఠాలు రిజర్వేషన్లపై పెద్దఎత్తున ఉద్యమించడంతో వీరిపై ఇతర సామాజికవర్గాల్లో కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఒకరి మద్దతు తీసుకుంటే మరో వర్గం వారు దూరమవుతారనే ఆందోళన పార్టీల్లో నెలకొంది. అయితే నాలుగు వందలకుపైగా కులాలున్న ఓబీసీలను ఆకట్టుకునే అజెండా తీసుకురావడం అంత తేలిక కాదు. మరోవైపు ఎస్టీలో చేర్చాలని ధంగర్ సామాజికవర్గం డిమాండ్ చేస్తుండడంతో ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలు ఏకపక్షంగా ఒకరిపై మొగ్గు చూపేందుకు వెనుకంజ వేస్తున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సామాజికవర్గాల చుట్టూ తిరుగుతుండడంతో రెండు కూటములు ఆచితూచి అడుగులేస్తున్నాయి. హిందుత్వ ఓటు బ్యాంక్పై భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీ బ్రాహ్మణులు, రాజ్పుత్లు, లింగాయత్లు, అగారీలను ఏకం చేసేలా సామాజిక సమీకరణ చేస్తుండగా, కాంగ్రెస్ దళితులు, ముస్లింలు, గిరిజనలుపై ఆశలు పెట్టుకుంది. దీంతో పాటు ఓబీసీలోని కొన్ని వర్గాలు, మరాఠాలు మహాయుతిపై ఆగ్రహంగా ఉన్నారని, దీన్ని సానుకూలంగా మల్చుకోవాలని ఎమ్వీఏ కూటమి భావిస్తోంది.

ప్రాంతీయ పార్టీలు చీలిన తర్వాత తొలిసారిగా నవంబర్ 20వ తేదీన జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శివసేన ఏకనాథ్ శిండే పార్టీ, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ బీజేపీతో కలిసి మహాయుతి కూటమిగా, శివసేన ఉద్దవ్ ఠాక్రే పార్టీ, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ కాంగ్రెస్తో కలిసి ఎమ్వీఏ కూటమిగా తలపడుతున్న ఈ ‘మహా’సంగ్రామంలో సామాజికవర్గాలు ప్రధానంగా మరాఠాలు, ఓబీసీలు ఎవరిని ఆదరిస్తారో నవంబర్ 23 తేదీన వెలువడే ఫలితాల్లో స్పష్టం కానుంది.