FeministBoys:
(అమెరికాకు చెందిన రచయిత్రి, సైకాలజిస్టు, హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యురాలు ‘Bobbi Wegner’. ఆమె ‘Groops’ సంస్థ వ్యవస్థాపకురాలు. 2021లో ఆమె రాసిన ‘Rasing Feminist Boys’ పుస్తకం ప్రాచుర్యం పొందింది. TED వేదికపై ఆమె ఇచ్చిన ప్రసంగంలోని కొంత భాగానికి ఈ వ్యాసం స్వేచ్ఛానువాదం).
ఈ సంగతి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నా ఇంటి నుంచే! ఇల్లే కదా మన ప్రపంచం. ప్రపంచంలో మనకు ఊహ తెలిసే తొలి ప్రదేశం ఇల్లే! నాకు ముగ్గురు పిల్లలు. వాళ్లకు తొమ్మిదేళ్లు, ఏడేళ్లు, నాలుగేళ్లు. పిల్లల్ని కనడం ఆనందం. వాళ్లని సక్రమంగా పెంచడం ఒక బాధ్యత. అందులోనూ అబ్బాయిలను పెంచడం బరువైన బాధ్యత. వాళ్లని మంచి అబ్బాయిలుగా పెంచడం మరింత పెద్ద బాధ్యత. మంచి అంటే? పెరిగి, పెద్దయి, సమాజంలో స్త్రీల తరఫున, వీలైతే అందరి తరఫునా ధైర్యంగా నిలబడగలిగే మంచితనం. అంతేకానీ వాళ్ల కోసం మాత్రమే వాళ్లు బతికే విధంగా వాళ్లను పెంచలేను.
సరే! మీ అందరికీ ముందుగా ఒక ప్రశ్న! Feminism (స్త్రీవాదం) అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? మీ కంటి ముందు ఏం కనబడుతుంది? మీ మనసులో ఏం మెదులుతుంది? కాస్త ఆలోచించి పెట్టుకోండి. ఆ విషయానికి తర్వాత వస్తాను.
ఒకానొక అక్టోబర్ నెల సోమవారం సాయంత్రం మా ఇంట్లో నేను పొయ్యి దగ్గర నిలబడి వంట చేస్తున్నాను. పక్కనే బండల మీద నా ఆరేళ్ల కొడుకు టైలర్ లే కూర్చుని ఐపాడ్‌లో మైన్‌క్రాఫ్ట్ గేమ్ ఆడుకుంటున్నాడు. ఆ టైంలో నేను నేషనల్ పబ్లిక్ రేడియో(NPR) వింటున్నాను. హార్వే వీన్‌స్టన్ అనే సినీ నిర్మాత, ఆయనతోపాటు మరికొందరు మహిళల మీద లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లిన విషయం చెప్తున్నారు. ఓహ్! ఇలాంటి పరిణామం చాలామందికి గుణపాఠంగా మారుతుంది అని నేను మనసులో అనుకుంటూ వింటున్నాను. దేశంలోని ప్రతి ఆరుగురిలో ఒక స్త్రీ ఏదో రూపంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటోందని వాళ్లు గణాంకాలు వివరించారు.
నాకు నా కూతురు గుర్తొచ్చింది. తన బడిలో ఉండే ఆరుగురు పసిపాపల్లో ఒకరు రేపో మాపో తప్పకుండా లైంగిక వేధింపులకు గురవుతారనే విషయం నా మనసులో మెదిలింది. అది జరగదు అని అనుకునే అవకాశం లేదు. ప్రతి చోటా స్త్రీల మీద వేధింపులు జరుగుతున్నాయన్న సంగతి మీకూ తెలుసు! Dartmouth College(అమెరికాలో ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థ)లోని వెయ్యి మంది ఆడవాళ్లలో ఆరుగురి మీద రేప్ జరిగినట్టు రిపోర్టులు ఉన్నాయి. ఆ లెక్కలోకి రాకుండా మిగిలినవి ఎన్ని ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు. ఇందులో లైంగిక వేధింపులు, ఇతర దాడులు కూడా లెక్కేస్తే సంఖ్య మరింత పెద్దదవుతుంది. అంటే స్త్రీల మీద వేధింపులకు పాల్పడేందుకు పురుషులు చాలా సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
నా పక్కనే నా కొడుకు ఉన్నాడు. వాడు ఇవన్నీ వినకూడదన్న ఉద్దేశంతో వెళ్లి రేడియో ఆపేశాను. మన ఇళ్లలో సహజంగా ఇదే కదా జరిగేది. పిల్లల ముందు ఏవైనా క్రూరమైన, లైంగిక సంబంధమైన విషయాలు ప్రస్తావనకు వస్తే ఆ మాటలు ఆపేస్తాం! ఆ రకంగా వారి మీద ఆ ప్రభావం పడకుండా చూసుకుంటాం! అంతేనా? సైకాలజిస్టులు చెప్పే వివరాల ప్రకారం ఐదు నుంచి పదేళ్ల వయసు మధ్య పిల్లలు తమ చుట్టూ చూసే మనుషుల ద్వారా నైతిక విషయాలు నేర్చుకుంటారు. అది తల్లిదండ్రులా, టీచర్లా, సినిమా హీరోలా, రాజకీయ నాయకులా.. ఎవరైనా సరే! వాళ్ల ప్రవర్తనే ఆ పసిపిల్లల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇప్పుడు నా ఆరేళ్ల పిల్లాడికి నైతికత గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అనిపించింది.
నా కొడుకును పిలిచి, “లే! ఒక సినిమా వ్యక్తి ఉన్నాడు. ఆడవాళ్లకు ఇష్టం లేకుండా వారిని తాకాడు. వారితో అనకూడని మాటలు అన్నాడు. అందువల్ల అతన్ని జైల్లో వేశారు” అని చెప్పాను. చెప్పాక ఒక నిమిషం ఆలోచించాను. రేపు వీడు వెళ్లి వాళ్ల ఫ్రెండ్స్‌తో ఈ విషయం చెప్తాడు. వాళ్లు వాళ్ల ఇళ్లల్లో చెప్తారు. ‘కొడుక్కి ఇలాంటి విషయాలా చెప్పేది?’ అని వాళ్లు నా గురించి తప్పుగా అనుకుంటారు. ఇవన్నీ నా మనసులో తిరుగుతున్నాయి. మా అబ్బాయి నిదానంగా నన్ను చూసి “అలా చేయడం చట్టవ్యతిరేకమా? ట్రంప్(అమెరికా మాజీ అధ్యక్షుడు) చేశాడు కదా?” అన్నాడు. నాకు దిమ్మ తిరిగిపోయింది.
ఆ తర్వాత నాకు మెల్లగా అర్థమైంది. ఇది Sexual Responsibilityని మించి లోతైన అంశం. Gender Equality. ఆడవాళ్లను మగవాళ్లు ఎలా చూస్తారు? వారితో ఎలా ప్రవర్తిస్తారు అని తెలియజెప్పాల్సిన విషయం. అది మనం ఎప్పుడూ నేరుగా మాట్లాడుకోం! మనకంటూ కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. అమ్మాయి అనగానే పింక్, అబ్బాయి అనగానే బ్లూ. ఆడవాళ్లంటే మృదుత్వం, మగవాళ్ళంటే దృఢత్వం. ఇలా విజృంభించి చూడటం మనకు అలవాటైంది. మన మెదళ్లకు అలాగే అలవాటు చేశాం.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం 2005 నుంచి 2015 వరకు ఒక సర్వే నిర్వహించింది. మగవాళ్లకే కెరియర్ అంటూ ఉంటుందని, ఆడవాళ్లు వంటింటికే పరిమితం అవుతారని 76 శాతం మంది ఇంకా నమ్ముతున్నారు. అలా అని మన మెదళ్లు క్రూరంగా, వివక్ష పూరితంగా ఏమీ లేవు. ఎటొచ్చీ మన నమ్మకాలు అలా ఉన్నాయి. అలాంటి నమ్మకాలనే ఏళ్లుగా మనం కొనసాగిస్తూ వస్తున్నాం. ఇదంతా మన మెదడులో పేరుకుపోయిన ఆలోచనల పరిమితి. నా మాట నమ్మండి, మీరు నిస్సందేహంగా ఆ పరిమితిని దాటొచ్చు. పాత నమ్మకాలు వదిలేసి కొత్తగా ఆలోచించొచ్చు.
ఇప్పుడు మరోసారి Feminism దగ్గరికి వస్తాను. ఆ మాట వినగానే మీకు ఏం అనిపిస్తుంది? Feminist అనగానే ఏం గుర్తొస్తుంది? బ్రాలు తగులబెట్టే ఆడవాళ్లు, మగవాళ్లను ద్వేషించే ఆడవాళ్లు.. ఇవా? సరే! సత్యం చెబుతాను. Feminist అంటే స్త్రీ పురుష సమానత్వాన్ని నమ్మే వ్యక్తి. అంతే! చాలా సింపుల్! మీలో చాలామందికి స్త్రీ పురుష సమానత్వం అంటే నమ్మకం ఉంది. కానీ స్త్రీవాదులు అంటే నచ్చదు. ఎందుకు? రెండు విరుద్ధ భావాలను మీ మనసు ఒకేచోట మోస్తూ మీకు అసౌకర్యం కలుగజేస్తుంది కాబట్టి. మీరు స్త్రీ పురుష సమానత్వాన్ని కాంక్షిస్తారు, నమ్ముతారు. కానీ ‘స్త్రీవాదం’ అనే మాట వినగానే అసౌకర్యంగా ఫీలవుతారు.
మీరే కాదు, చాలామంది మీలాగే ఉంటారు. Gender Equalityని నమ్ముతూనే, తమను తాము ‘స్తీవాదులు’ అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. Feminists అనగానే క్రూరమైన ముఖం, పురుషులను ద్వేషించే తత్వం, వాళ్లని అణగదొక్కాలనే తాపత్రయం.. ఇవన్నీ ఊహిస్తారు. Feminism అనే పదానికే చాలా దూరంగా ఉంటారు. కానీ ఒక నిజం చెప్పనా? స్త్రీవాదం, స్త్రీత్వం వేర్వేరు కాదు. నైజీరియన్ రచయిత్రి ‘Chimamanda Ngozi Adichie’ చెప్పినట్టు ‘ఫెమినిస్టుగా ఉండటం అంటే గర్భవతిగా ఉండటమే! అయితే అవును, లేదా కాదు. మధ్యలో ఉండే అవకాశం లేదు’. నేను ఫెమినిస్ట్‌గా ఉంటూనే నా భర్తను ప్రేమించగలను. నా పిల్లల్ని చూసుకోగలను. లిప్‌స్టిక్ వేసుకుని, నాకు నచ్చిన బట్టలు ధరించగలను. నాకు నచ్చినట్టు నేను ఉండగలను. ఇవన్నీ చేస్తూనే Gender Equality కోసం పోరాడగలను. అదే Feminism.
మరో పది, పాతికేళ్లలో ఇప్పటి పిల్లలు పెద్దవాళ్లు అవుతారు. ఇప్పటిదాకా వాళ్లకు సమాజం ఏం నేర్పిందో అదే వాళ్లు ఆడవాళ్ల విషయంలో ఆచరణలో పెడతారు. అది మనం మార్చాలి. ఇన్నాళ్లు వాళ్ల మెదడులో పాతుకుపోయిన నమ్మకాల్ని ఇప్పుడే తుడిచేసి కొత్తగా ఆలోచించే మార్గం చూడాలి. ఆడవాళ్లు కూడా కెరీర్ గురించి ఆలోచిస్తారు, దాని కోసం శ్రమిస్తారు అనే విషయం అర్థమయ్యేలా చెప్పాలి. స్త్రీ పురుషులు సమానమే అన్న విషయాన్ని మీరు నమ్మితే, అది వారికి ఇప్పటినుంచే అర్థం చేయించాలి.
స్త్రీ పురుష సమానత్వాన్ని మీరు నమ్ముతున్న విషయం మీ పిల్లలకు చెప్పాలి. మీ ఇళ్లలో అలాగే ప్రవర్తించాలి. ఎందుకంటే మీ నుంచే మీ పిల్లలు నేర్చుకుంటారు. రాబోయే తరాల పిల్లలు, ముఖ్యంగా అబ్బాయిలు Feministsగా ఎదగాలి. అంటే అర్థం తెలుసు కదా? స్త్రీ పురుష సమానత్వాన్ని కోరే వ్యక్తి.
_ విశీ