కొత్త త్రిదళాధిపతిని ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. త్రివిధ దళాల సిఫారసు మేరకు అర్హుల జాబితాను త్వరలోనే రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అధికారులు అందజేయనున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ వారసుడ్ని ఎంపిక చేసేందుకు ఆర్మీ, నేవీ, వాయుసేన సీనియర్ అధికారులతో కూడిన ప్యానెల్‌ను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుంది.
మరోవైపు కొత్త సీడీఎస్‌గా ఎంపికయ్యే అవకాశాలు సైన్యాధిపతి జరనల్ ఎంఎం నరవణెకే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుభవంలో అందరికన్నా సీనియర్ కావడం వల్ల ఈ పదవి దాదాపు ఆయనకే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్మీ చీఫ్‌గా జనరల్ బిపిన్ రావత్ నుంచి 2019 డిసెంబర్ 31న నరవణె బాధ్యతలు స్వీకరించారు. 2022 ఏప్రిల్ వరకు ఆయన పదవీకాలం ఉంది. ప్రస్తుతమున్న వాయుసేన చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ఈ ఏడాది సెప్టెంబర్ 30నే బాధ్యతలు స్వీకరించారు. నౌకాదళ అధినేత అడ్మిరల్ ఆర్.హరికుమార్ నవంబర్ 30న ఆ బాధ్యతలను తీసుకున్నారు.
వీరిద్దరు ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించడం.. మరోవైపు అనుభవంలో అందరికన్నా సీనియర్ అయిన నరవణెకే ఈ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. త్రిదళాధిపతుల ఎంపికకు అనుసరిస్తున్న విధానాన్నే సీడీఎస్ ఎంపిక విషయంలోనూ కేంద్రం పాటించనుంది.