దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్):
(” ఇదో, ఇదే మిస్సవుతున్నాం! క్రింది సంభాషణలోని సొబగు చూడండి!”)
సంఘ జీవనంలోని సౌలభ్యం, సౌఖ్యమిది! ఇలా, ఒకప్పుడు ఊళ్లలో ఉండేది. ఒకప్పుడని ఎందుకంటున్నానంటే… ఇప్పుడు పల్లెటూళ్లు కూడా బాగా మారిపోయాయి. పాత రోజుల్లోలా ప్రేమలు, ఆప్యాయతలు, పరస్పర సహాయ-సహకారాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. “ఇంకో గంటయితే ఇడ్వాటింటిక్ పెళ్లి కొడుకు వాళ్లొస్తారు, కమ్మరి దత్తాత్రి దగ్గర పెట్రోమాక్స్ లాంతరుంది తెచ్చావా” అనే ఇంటిపెద్ద పెద్ద స్వరం, “అమ్మనా? శాంతక్కోళ్ల ఇంట్ల ఇవాళ చేగోళ్లు, అప్పలు చేయడానికెళ్లింది, వారంలో వాళ్లింట్లో పెళ్లి కద, అన్నీ టేబుల్ మీదున్నాయి, మననే పెట్టుకొని తినేసేయమంది” ఇంటి చిన్నోడి చిన్న స్వరం…. మీరూ, మీమీ ఊళ్లల్లో విననివేమీ కావు! కానీ, ఇప్పుడు….. జీవనంలో పెరిగిన వేగం, సంక్లిష్టత, స్పర్ధ వంటివే కాక మనుషుల్లో హెచ్చిన స్వార్థం, అహం, సంకుచిత ధోరణి… ఇలాంటివి, కారణాలేమైనా కావొచ్చు! దాంతో, పల్లెలిపుడు హృదయం పోగొట్టుకొని రోదిస్తున్నట్టున్నాయి. స్థూలంగా అది వేరే విషయం, ఇంకెప్పుడైనా లోతుగా మాటాడుకుందాం.
వయసు మళ్లిన, మళ్లుతున్న వాళ్లు ఎందుకు చరమ జీవనం కోసం ‘గేటెడ్ కమ్యూనిటీ-GC’ల వైపు చూస్తున్నారూ? అంటే, ఇదీ ఓ కారణమేమో! ఏవో కొన్ని ఇబ్బందులున్నా… సానుకూలాంశాలే ఎక్కువ. జనం స్వభావ రీత్యా అందరు అందరితో కలవలేరు. జన సంబంధాల విషయంలో పరస్పర విరుద్దాలైన అటాచ్మెంట్-డిటాచ్మెంట్లలో తగిన ఎంపికతో ఏదైనా ఇక్కడ పొందొచ్చు. వాకింగ్, టాకింగ్, జిమ్, స్విమ్, ఆట-పాటలు, కాయగూరలు, సరుకులు, మందులు…. అన్నీ కాంపౌండ్ లోపలే దొరుకుతాయి. ప్రశాంతత, దీనికి తోడు భద్రతకు ఎంతోకొంత గ్యారెంటీ! ఇంకేం? చదువులు, ఉద్యోగాల రీత్యా ఎక్కడో దూరదేశాల్లో ఉంటున్న పిల్లలు కూడా తమ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కి వీటినే సూచిస్తున్నారు. ఏర్పాటు చేస్తున్నారు.
(So, జై జై GC లైఫ్..ఈ సరికొత్త వాకిట్లో, నే పొద్దెరుగని కొత్త బిచ్చగాడినేమో! )