ఒలంపిక్స్ అథ్లెటిక్స్ లో భారత్ 100 ఏళ్ల స్వర్ణం సాకారం!

ఒలంపిక్స్ అథ్లెటిక్స్ లో.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద ఏళ్ళ భారత్ కలను నెరవేర్చాడు యువ అథ్లెట్ నీరజ్ చోప్రా. జావెలిన్​ త్రో ఫైనల్లో గెలిచి.. మువ్వన్నెల పతాకానికి పసిడి కాంతులద్దాడు. మొత్తంగా టోక్యో ఒలంపిక్స్ లో భారత అథ్లెట్లు ఈసారి గొప్ప ప్రదర్శన చేశారు. దీంతో ఓ స్వర్ణం.. రెండు రజతాలు.. నాలుగు కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి.

టోక్యో ఒలంపిక్స్ లో సరికొత్త చరిత్రను లిఖించిన నీరజ్‌ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాకుండా నజరానాలు కూడా వెల్లవెత్తుతున్నాయి. అయితే నీరజ్‌కు ఈ విజయం అంత సులభంగా రాలేదు. దీని వెనక ఎంతో కఠోర శ్రమ ఉంది. ఒకానొక సమయంలో 90 కేజీల బరువుతో సతమతమైన నీరజ్‌.. తనను తాను మార్చుకొని క్రీడారంగంలో ఉన్నత స్థాయికి ఎదిగాడు.

నీరజ్ హర్యానా రాష్ట్రంలోని, పానిపట్ జిల్లా ఖాంద్రా గ్రామంలో 1997 డిసెంబర్ 24న జన్మించాడు. చండీగఢ్ డీఏవీ కాలేజీలో చదివాడు.
ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్. ప్రస్తుతం ఆర్మీలో నాయబ్ సుబేదార్ ర్యాంక్‌లో ఉన్నాడు.
ఇక ఆట విషయానికొస్తే నీరజ్ చోప్రా 2018లో తన అత్యుత్తమ ప్రదర్శనను (88.06 మీటర్లను) సాధించాడు. కాగా భారత్‌కు ఒలింపిక్స్‌ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం అందించిన రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఆసియా, కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాలు ముద్దాడిన నీరజ్‌ ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లోనూ అగ్ర స్థానంలో నిలిచాడు. అతడు 2021 మార్చిలో 88.07మీ, 2018, ఆసియా క్రీడల్లో 88.06మీ, 2020 జనవరిలో దక్షిణాఫ్రికాలో 87.87 మీ, 2021 మార్చిలో ఫెడరేషన్‌ కప్‌లో 87.80మీ, 2018, మేలో దోహా డైమండ్‌ లీగ్‌లో 87.43 మీ, 2021 జూన్‌లో కౌరెటనె గేమ్స్‌లో 86.79మీటర్లు ఈటెను విసిరి రికార్డులు సృష్టించాడు.