Nancharaiah merugumala senior journalist:
……………………………………………..
అమెరికా జాతీయ రాజధాని వాషింగ్టన్ డీసీ మేరీలాండ్ శివారు ప్రాంతం Accokeek లో ఆదివారం లాంఛనంగా ఆవిష్కరించారు డాక్టర్ భీంరావ్ ఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని. 19 అడుగుల పొడవున్న ఈ విగ్రహం పేరు ‘సమతా విగ్రహం’ (Statue of Equality). ఈ ఆధునిక సమతామూర్తి అంబేడ్కర్ కొత్త విగ్రహం రూపొంచింది..ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్. ఆయన ఇంటిపేరు సుతార్ (సూత్రధార్) ఆయన విశ్వకర్మ సముదాయంలోని వడ్రంగి వర్గీయుడని చెబుతోంది. ఈ రామ్ సుతారే..గుజరాత్ సర్దార్ సరోవర్ డాం వద్ద ఏర్పాటుచేసిన వల్లభాయ్ పటేల్ ఎత్తయిన విగ్రహాన్ని కూడా తయారుచేశారు. ” ఈ సమతా విగ్రహం 140 కోట్లకు పైగా ఉన్న భారతీయులకే గాక ఇక్కడ నివసిస్తున్న 45 లక్షల భారతీయ అమెరికన్లకు కూడా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ విగ్రహం అమెరికాలోని నాలుగున్నర మిలియన్ల భారత సంతతి జనానికే గాక ఇక్కడ బతుకుతున్న కొట్లాది మంది నల్లజాతి, హిస్పానిక్, ఇతర జాతుల వారికి స్ఫూర్తినిస్తుంది,’ అని భీంరావ్ విగ్రహావిష్కరణ సందర్బంగా అమెరికాలో దళిత ఉద్యమాన్ని నడుపుతున్న న్యూయార్క్ నివాసి దిలీప్ మాస్కె చెప్పారు. అంబేడ్కర్ మొదట ఉన్నత విద్య అభ్యసించింది ప్రపంచ ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీలోనే. పై విగ్రహం ఏర్పాటు చేసిన మేరీలాండ్ శివారుకు సమీపంలోనే ఈ విశ్వవిద్యాలయం (న్యూయార్క్ నగరంలో) ఉంది.