యూపీ బీజేపీలో ఏంజరుగుతోంది? మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని ఎందుకు వీడుతున్నారు? కమలం పార్టీలో ముసలం మొదలైందా? ఎస్పీలోకి వలసలు దేనికి సంకేతం? మరోసారి కులం, ఓటు బ్యాంకు రాజకీయాల ప్రభావమెంత? వలసలపై కమలనాధులు సమాధానం ఏంటి?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ యూపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎస్పీలో చేరారు. ఈనేపథ్యంలో ఎప్పటిలానే దేశవ్యాప్తంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్స్ కమలం పార్టీపై విషప్రచార కథనాలను మొదలెట్టాయి. ఇదే అదనుగా ప్రతిపక్ష పార్టీల నాయకులు, కొన్ని మీడియా సంస్థ ప్రతినిధులు పుంకాలు పుంకాలు వ్యాసాలు ఉదరగొట్టేస్తున్నారు. అంత ఐపోయిందని అధికార మార్పిడి తథ్యమన్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.
అటు కమలం పార్టీ నేతలు మాత్రం ప్రతి పక్షాల ఆరోపణలపై మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా యూపీలో బీజేపీ బలపడిందంటున్నారు. దళితులకు, బీసీలకు తగినంత ప్రాధాన్యత కల్పించలేదన్న ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. కులం , ఓటు బ్యాంకు రాజకీయాలు ముగిసిపోయిన అధ్యాయమని.. అభివృద్దే ప్రధాన అంశంగా చెప్పుకొస్తున్నారు. బీజేపీలో ఓకులానికి, ఒక ప్రతినిధి అంటూ ఎవరూలేరని..అన్ని వర్గాలకు సరిపడా ప్రతినిధులు పార్టీలో ఉన్నారంటున్నారు.పార్టీలో భవిష్యత్ లేదని భావించేవారు.. తమ పనితీరుపై నెగెటివ్ రిపోర్ట్ ఉన్న వారు మాత్రమే పార్టీని వీడుతున్నారని నేతలు పేర్కొంటున్నారు.
2014 తర్వాత వలసలను పరిశీలిస్తే..పార్టీలో చేరినవారే ఎక్కువగా ఉండటమే కాకుండా.. బీజేపీ ఓటు బ్యాంకు కూడా బాగా పెరిగిందంటున్నారు. 2017 తర్వాత యూపీలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వస్తోందంటున్నారు. అప్పుడు పార్టీ సభ్యులు సంఖ్య 1.87 కోట్లు మంది ఉండగా… ఇప్పుడు 3.80 కోట్లకు పెరిగిందంటున్నారు. 2017లో 325 సీట్లు గెలుచుకున్నామని.. ఇప్పుడు ఆసంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు.
అటు టికెట్ల విషయంలోనూ బీజేపీ ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటుదని.. ఫీడ్ బ్యాక్ ఆధారంగానే టికెట్లను ఇస్తుందంటున్నారు కమలనాధులు. దీనికోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఓసర్వే చేపడుతుందన్నారు. గతంలో పార్టీ గెలవలేని చోట్ల మంచి నాయకుడి కోసం కూడ సర్వే చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. తమకు టికెట్ రాదని భయపడే వారు పార్టీని వదిలివెళ్లిపోవడం సాధారణమని.. ప్రజలకు మేలు చేయలేని నాయకులు బీజేపీలో ఉన్న ఇతర పార్టీలో ఉన్న ఒకటే అన్నది బీజేపీ నేతల సమాధానంగా తెలుస్తోంది.
ఇక మీడియా సంస్థల అసత్య కథనాలపై స్పందిస్తూ.. కొందరూ స్వార్థం కోసం మీడియాను అడ్డంపెట్టుకుని పార్టీపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా సీఎం యోగి పాలనసాగిస్తున్నారన్నారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు.. పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. అభివృద్ధి మంత్రమే తమ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకోస్తుందని కమలనాధులు ధీమావ్యక్తం చేస్తున్నారు.