Teluguliterature:
శా :
ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం
చిద్ర్దోహంబును నీకుఁజేయరు, బలోత్సేకంబుతోఁ జీకటిన్
భద్రాకారులఁ చిన్న పాపల రణప్రౌఢక్రియా హీనులన్
నిద్రాసక్తుల సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో?
ప్రేగు తెంచుకు పుట్టిన బిడ్డలు… అదీ అన్నెం-పుణ్ణెమెరుగని చిన్నారులు… ఒకరో ఇద్దరో కాదు ఐదుగురిని, ఒక్కపెట్టున గొంతుకోసి సంహరిస్తే ఏ తల్తి గర్భశోకమైనా ఎలా ఉంటుంది? గుండెను పిడికిట పట్టి పిసికినట్టుండే ఆ తల్లి హృదయ వేదనను ఆవాహన చేసుకొని… బమ్మెర పోతన రాసిన ఆణిముత్యం వంటి పద్యమిది.
కురుక్షేత్ర మహాయుద్ధం ముగిసిన తర్వాత… ఆ కాళరాత్రి, యుద్దావారంలో, విశ్రాంతి శిబిరాల్లో గాఢ నిద్రలో, అందుబాటులో ఉన్న అందరినీ మట్టుపెట్టిన అశ్వత్థామ పసిబిడ్డలైన ఐదుగురు ఉపపాండవులనూ నిర్దయగా హతమార్చాడు. పాండవ నిర్వంశమే లక్ష్యంగా ఈ పాతకానికి, ఘాతుకానికీ ఒడిగట్టాడు.
నిర్నిమేషంగా విలపిస్తోంది పాండవ ధర్మపత్ని ద్రౌపది, నిర్జీవులై పడి ఉన్నారు ఐదుగురు వంశాంకురాలు కళ్లెదుట! ఈ ఘోరం తెలిసిన వెంటనే, నరమేధానికి పాల్పడ్డ అశ్వత్థామను బంధించి తెచ్చారు పాండవులు, ఆగ్రహంతో తక్షణం హతమార్చడానికి! యుద్ధభూమిలో కురు-పాండవ గురుడైన ద్రోణాచార్యుని మరణం తర్వాత.. పతిని కోల్పోయి శోకతప్త అయిన గురుపత్ని కృపి హృదయస్థితిని సాటి ఆడదానిగా అర్థం చేసుకుంది పాండవ పట్టమహిషి. అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్న ద్రోణసతి పుత్రవిహీన కారాదని, అపార క్షమాగుణం చూపుతుంది, తానూ పుత్రుల్ని కోల్పోయిన తల్లి ద్రౌపది. పుత్ర వియోగ ప్రతీకారాగ్నితో జ్వలించిపోతూ, గురుపుత్రుడైన అశ్వత్థామను సంహరించవద్దని, అతడ్ని వదిలేయమని పతులైన పాండవులను అర్థిస్తుంది కరుణార్ధ్ర హృదయంతో పాంచాలి. ‘క్షమయే కద! సమస్త మానవేతిహాసంలో ఉత్తమోత్తమమైన మానవగుణం!’’ అలా వదిలేయడానికి ముందు…. ఉండబట్టలేక అశ్వత్థామను ఒకమాటడుగుతోంది, గద్గద స్వరంతో. అందుకు శార్దూలాన్ని ఎంచుకున్నాడు పోతన. భావం చూడండి…..
‘‘నీకు చేతులెట్లా వచ్చాయయ్యా? ఆ … !ఉప పాండవులైదుగురు…. ఉద్రేకంగా అస్త్రాశస్త్రాలు ధరించిన వారు కారు. కనీసం యుద్ధభూమిలోనూ లేరు. పోనీ, నీకేమయినా, ఏ రూపంలోనైనా, ఎపుడైనా కించిత్తు ద్రోహం చేసిన వారా ? అంటే అదీ కాదు. నీవు బలవంతుడవే, సందేహం లేదు. తిరుగులేని బలముందనే ఉత్సుకతతో, గర్వంతోటి, నీవు తలపడ్డ ఘోరాన్ని ఇరుగో, పొరుగో చూసి అడ్డుకోవడానికీ అవకాశమే లేకుండా చిమ్మచీకట్లో, ఏ యుద్దనీతీ వర్తించని రీతిలో, సురక్షితంగా విశ్రాంత శిబిరంలో ఉన్నవాళ్లను, పసివాళ్లని, యుద్ద కళో, మెళకువలో తెలిసిన ప్రౌడలూ కాని చిన్నారుల్ని, అందులోనూ… కనీస ప్రతిఘటనకు ఆస్కారమే లేకుండా నిద్రపోతున్నవారిని….. చంపడానికి నీకు చేతులెట్లావచ్చాయి?’’ అని రోధనతో ప్రశ్నిస్తోంది.
పోకడ గంభీరంగా ఉండటానికి శార్దూల వృత్తాన్ని ఎంచుకొని, లేవనెత్తే అంశంలోని ఆర్ద్రతగల వస్తు గమనంలో గుండెల్ని పిండేసే తడి అద్దుతూ… సహేతుకమైన సందేహాలను, ధర్మసమ్మతమైన ప్రశ్నల్ని రేపుతూ… ద్రౌపది విస్మయాన్ని వ్యక్తం చేసిన కంపిత స్వరాన్ని పద్యంలో నింపాడు. లౌకిక ప్రపంచంలో… సగటు మనిషి తలపునకు వచ్చే సందేహ భావన ‘ఇంత ఘోరం చేయడానికి నీకు చేతులెట్లా వచ్చాయ’నే దేశ్యం వాడాడు. ఏదైనా సాధ్యపడని శ్రమకి, చేయకూడని పనికి ‘అయ్యో నా చేతులాడటం లేద’నో, వెళ్లకూడని చోటికయితే ‘కాళ్లాడటం లేద’నో పలకడం నిత్య వ్యవహారికం. అలాంటి పదం-నుడికారపు ప్రశ్నా పదబంధంతో పద్యాన్ని పోతన ముగించిన తీరు అత్యద్భుతం.
సహజ పండితుడైన పోతన, తెలుగు భాష గుట్టు-మట్లపై పట్టు, అపార పదసంపద గలవాడు. కావ్య సృజనపై నిస్సంశయ నిబద్దత కలిగిన వినయశీలుడు. దైవంపై అచంచల విశ్వాసం, ఆయన మహాత్మ్యం మీద తరగని గురికల భక్తాగ్రేసరుడైన పోతనకు పద్య నిర్మాణ కౌశలం అబ్బటం వల్లే…. శ్రీమద్భాగవతంలో ఇటువంటి ఎన్నో, ఎన్నెన్నో పద్యరత్నాలుసాకారమయ్యాయి.
వందల ఏళ్లయినా వన్నె తగ్గని సౌందర్యం, వాసన తగ్గని సౌరభంతో ఘట్టాలు, ఘట్టాలుగా అవి శాశ్వతత్వం పొంది విరాజిల్లుతూనే ఉన్నాయి. బాలకృష్ణ లీలలు, రుక్మిణీ కళ్యాణం, గజేంద్రమోక్షం, బలి కథ, ప్రహ్లాద చరిత్ర….. ఇలా ఎన్నెన్నో! అందులోని పద్యాలు ప్రజల నాలుకలపై నేటికీ విరబూస్తున్నాయి. సందర్భాన్ని-వీలుని బట్టి, ఇదే వేదిక నుంచి మీతో అప్పుడప్పుడు ముచ్చటిస్తాను. ఇప్పటికిక సెలవు.