Vaikunta ekadashi: హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేక సౌరమాన ప్రకారం జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏకాదశి గురించి మరి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..
భవిశ్యోత్తర పురాణం:
వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారని తెలుపబడింది. అయితే ముక్కోటి ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో కానీ పుష్య మాసంలో కానీ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్లపక్ష ఏకాదశి మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని పురాణంలో చెప్పబడింది. పుణ్య తిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఈ ఏకాదశి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వస్తుంది. సమస్త కోరికలు తీర్చి.. పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో ఈ పర్వదినాన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు.ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోగానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారని అష్టాదశ పురాణాల్లో పేర్కొనబడింది.
ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికి అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తారు. ఉత్తర ద్వార దర్శనంగా పిలిచే వైకుంఠ ద్వార దర్శనం ద్వారా శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఏకాదశి రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశి ఉపవాసాలతో సమానమని శాస్త్రం చెబుతుంది. అందుకే ఈరోజు ఉపవాసం ఉండడం తప్పనిసరిగా భావిస్తారు. ముక్కోటి అంటే మూడు కోట్ల దేవతలు అని అర్థం. ఈ ఏకాదశి రోజున మూడు కోట్ల దేవతలు భగవంతుడిని స్మరించి సేవిస్తారని పురాణాల్లో చెప్పబడింది.
వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ ఏకాదశి రోజున స్వర్గ ద్వారం తెచ్చుకుంటుందని భక్తుల నమ్మకం. ఈ వైకుంఠ ద్వారం ద్వారా భగవంతుని కృపను పొందడానికి భక్తులు ఆత్మార్పణంగా పూజలు చేస్తారు. ఈ పర్వదినాన మధుకైటభులనే రాక్షసులకు శాపవిమోచనం కలిగించి.. తన వైకుంఠ ద్వారం వద్ద విష్ణు భగవానుడు దర్శన భాగ్యం ప్రసాదించాడనీ పండితులు చెబుతుంటారు. ఈ ఏకాదశి నాడే హలహలం అమృతం రెండు పుట్టాయని.. మహాశివుడు హాలాహలం తన కంఠంలో దాచుకొని దేవతలకు అమృతం ప్రసాదించాడని.. మహాభారత యుద్ధంలో గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడని పురాణ కథ.
పురాణకథ:
సత్యయుగంలో ముర అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి వరం పొంది దేవతలను హింసించసాగాడు. రాక్షసుడు బాధలు తాళలేక దేవతలు, ఋషులు మహావిష్ణువును శరణువేడారు. దీంతో మహావిష్ణువు రాక్షసుడుతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగినట్లు పురాణాల్లో చెప్పబడింది. ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సంహరిద్దామని ముర రాక్షసుడు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో మహా విష్ణువు శరీరం నుంచి మహా తేజస్సుతో కూడియున్న యోగమయా అనే కన్య ఉద్భవించి రాక్షసున్ని సంహరిస్తుంది. ఆ కన్య పక్షంలో 11వ రోజు జన్మించింది కనుక ఆరోజును ఏకాదశి అని నామకరణం చేసి విష్ణువు వరమిస్తాడు.