‘ప‌ఠాన్’ రివ్యూ..(బాయ్ కాట్ బాబులు ఫుల్ హ్యాపీ)

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ న‌టించిన తాజా చిత్రం ‘ప‌ఠాన్’ . దీపికా ప‌దుకుణే క‌థానాయిక‌. సిద్దార్థ్ ఆనంద్ ద‌ర్శ‌కుడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలిమ్స్ చిత్రాన్ని నిర్మించింది. ఎన్నో వివాదాల మ‌ధ్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా.. ఈచిత్రం బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. షారుఖ్ కెరీర్ లోనే భారీ బ‌డ్జ్ ట్ తో తెర‌కెక్కిన ‘ప‌ఠాన్‌’ పై అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి వారి అంచ‌నాలు నెర‌వేరాయా? లేదా అన్న‌ది చూద్దాం!

క‌థ‌…
భార‌త ప్ర‌భుత్వం ఆర్టిక‌ల్ 370 (జమ్మూ మరియు కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా)ను ర‌ద్దు చేయ‌డంతో పాకిస్తాన్ బ‌యోవార్ ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం ఓ ప్రైవేట్ సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆసంస్థ ప్ర‌తినిధి జిమ్ (జాన్ అబ్ర‌హం).. వార్ కు సంబంధించి పూర్తి యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేస్తాడు. అనూహ్యంగా  ప్లాన్ అడ్డుకునేందుకు పఠాన్‌( షారుఖ్ ఖాన్‌) రంగంలోకి దిగుతాడు. ఈక్రమంలోనే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ రూబీ(దీపికా ప‌దుకుణే) సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇంత‌కు జిమ్ గీసిన ప్లాన్ ఏంటి? రూబీ పాత్ర ఏమిటి? బ‌యోవార్ ను ప‌ఠాన్ అడ్డుకున్నాడా? లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!

ఎవరెలా చేశారంటే..
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఎప్ప‌టిలానే త‌న‌దైన యాక్టింగ్ తో మెప్పించాడు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అద‌ర‌గొట్టాడు.   సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో మెరిశాడు.  హీరోయిన్ దీపికా ప‌దుకుణే.. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కే ప‌రిమిత‌మయ్యింది. ఆమె పాత్ర‌కు అంత‌గా స్కోప్ లేద‌నే చెప్ప‌వ‌చ్చు. విల‌న్ పాత్ర‌లో న‌టించిన మ‌రో హీరో జాన్ అబ్ర‌హం ఉన్నంత‌లోఆక‌ట్టుకున్నాడు. కీల‌క పాత్ర‌లో న‌టించిన అశుతోష్ రానా, డింపుల్ క‌పాడియా..మిగిలిన న‌టీన‌టులు త‌మ త‌మ‌ పాత్ర‌ల ప‌రిధి మేర న‌టించారు.

ఎలా ఉందంటే…
గూడఛార్యం నేప‌థ్యంలో ఇప్ప‌టికే అనేక సినిమాలు వ‌చ్చాయి. ప‌ఠాన్ మూవీ  కూడా  ఆకోవ‌కు చెందింది. ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ రాసుకున్న స్టోరీ లైన్ బాగున్న‌ప్ప‌టికీ.. బ‌ల‌మైన పాత్ర‌లుగా మ‌ల‌చ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. స‌ల్మాన్ ఖాన్ ఎపిసోడ్ మిన‌హా..మిగ‌తా యాక్షన్ స‌న్నివేశాలు అంత‌గా ఆక‌ట్టుకోవు. కొన్ని సీన్స్ ..హాలీవుడ్ మిష‌న్ ఇంపాజిబుల్ సిరీస్ ను చూసిన‌ట్లే అనిపిస్తుంది. ఫ‌స్ట్ ఆఫ్ ఫ‌ర్వాలేద‌నిపించినా.. సెకండాఫ్ ప్రేక్ష‌కుడి స‌హానానికి ప‌రీక్ష పెడుతుంది.మ్యూజిక్ సినిమాకు కొంత ప్ల‌స్. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది.నిర్మాత ఖ‌ర్చు ప్ర‌తి స‌న్నివేశంలో క‌నిపిస్తుంది.

మొత్తంగా భారీ బడ్జెట్.. తారాగణం తో తెరకెక్కిన ప‌ఠాన్.. షారుఖ్ అభిమానులు మెచ్చే సినిమా. మిగ‌తా వారికి క‌ష్ట‌మే సుమీ!

రేటింగ్ : 2.75/5  ( స‌మీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వ‌బ‌డింది)