వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసే పోటీ చేస్తాయి: పవన్ కళ్యాణ్

APpolitics:‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం… ప్రజల బాగు కోసం జనసేన, తెలుగుదేశం పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రెండు పార్టీల భవిష్యత్తు కోసమో.. ఇతర అవసరాల కోసమో కాదని..నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని..ఈ విద్వేష పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన పోవాలన్నదే  ఆకాంక్ష’ అని చెప్పుకొచ్చారు. గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో ములాఖాత్ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు గారికి, నాకు మధ్య కొన్ని పాలనాపరమైన సైద్ధాంతిక బేధాలున్నప్పటికీ..గతంలో విడివిడిగా పోటీ చేసినప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా.. రాక్షస పాలనను తరిమికొట్టేందుకు సమష్టిగా పోరాడేందుకు నిర్ణయించుకున్నామని తేల్చిచెప్పారు. ఈ పోరాటంలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తుందని బలంగా నమ్ముతున్నట్లు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై బీజేపీ అగ్రనాయకులకు పూర్తి సమాచారం ఉందని.. జనసేన ఎన్టీఏ పక్షంలోనే కొనసాగుతుందని.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కలిసికట్టు పోరాటం చేస్తామని  పవన్ పేర్కొన్నారు.

బురదలో కూరుకుపోయి.. ఆ బురద అందరిపై జల్లుతున్నాడు..

ఎన్నికల ముందు అధికార వ్యామోహంతో అడ్డగోలుగా హామీలు ఇచ్చిన వ్యక్తి తర్వాత వాటిని పూర్తిగా విస్మరించాడని పవన్ మండిపడ్డారు. మద్యపాన నిషేదం..సీపీఎస్ రద్దు.. 2 లక్షల 60 వేల ఉద్యోగాల భర్తీ అని మాయ మాటలు చెప్పిన వ్యక్తి ఆంధ్ర ప్రజల్ని నిలువునా మోసం చేశాడని వాపోయాడు. మద్యపాన నిషేధం అని చెప్పి కొత్త రకాల బ్రాండ్లతో..డిజిటల్ పేమెంట్లు లేకుండా చేసి వేల కోట్ల రూపాయాలు దోచుకున్నాడని ఆరోపించారు. అవినీతి, అక్రమాలతో రికార్డులు సృష్టించి పూర్తి స్థాయి బురదలో కూరుకుపోయిన వ్యక్తి… తనపై పడిన బురదను అందరికీ  అంటించాలనే ప్రయత్నం చేస్తున్నాడని..  అడ్డగోలుగా సహజ సంపదనలు కొల్లగొట్టి రాష్ట్రాన్ని డొల్లగా మారుస్తున్నాడని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ములాఖత్ ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది ..

టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ కచ్చితంగా ఆంధ్ర ప్రజల భవిష్యత్తు బాగు కోసం  ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నట్లు పవన్ స్పష్టం చేశారు . తాను కోరుకుంటుంది..  2014లో పోటీచేసినట్లుగా ఎన్టీఏ కూటమిలోని జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి వెళ్లాలని.. దీనిపై అనేకసార్లు బీజేపీ పెద్దలను కలిసి చెప్పినట్లు  వెల్లడించారు. దీనిపై బీజేపీ అధిష్ఠానం సానుకూల  నిర్ణయం  తీసుకుంటన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ దుష్ట పాలనను అంతమొందించాలంటే కచ్చితంగా సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ తేల్చిచెప్పారు.