PEDDAPALLI: పెద్దపల్లిలో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. ముచ్చటగా మూడోసారి గెలిచి నియోజకవర్గంపై జెండా ఎగరేయాలని అధికార పార్టీ భావిస్తుంటే..ఈసారి గెలుపు తమదంటే తమదంటూ ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు సై అంటే సై అంటు ధీమాతో కనిపిస్తున్నారు. ఇంతకు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? అధికార పార్టీ ఎమ్మెల్యే కొట్టడం ఖాయమేనా? కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? బీజేపీ నుంచి పోటిచేసే అభ్యర్థి ఎవరూ?
పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డి కొనసాగుతున్నారు. “నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే రెండోసారి గెలిచిన చరిత్ర లేదు సెంటిమెంట్” ను మనోహర్ రెడ్డి బ్రేక్ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోను గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే పనితీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ఎమ్మెల్యే కొత్తగా చేసిదంటూ ఏమిలేదని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే తనకున్న విద్యాసంస్థలు, ఇతర ఆదాయాలపై పెట్టిన శ్రద్ధ.. అభివృద్ధిపై పెడితే బాగుండేదని దెప్పిపొడుస్తున్నారు. ఇదిచాలదన్నట్లు కాంట్రాక్ట్ పనుల్లో బినామీల పేరుతో పనులు చేయించడంతో ఆయా గ్రామల సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని.. ఇసుక తవ్వకాలు, అమ్మకాలు ఎమ్మెల్యే కన్నుసైగల్లో నడుస్తున్నాయని ప్రతిపక్ష పార్టీల నేతల విమర్శలు చేయడం చూస్తుంటే..రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపు అంత ఈజీ కాదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇకపోతే బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం మరో ఇద్దరు అభ్యర్థులు పోటిపడుతున్నారు. వారీలో ముందువరసలో వినిపిస్తున్న పేరు నల్ల మనోహర్ రెడ్డి. నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న ఆయన
పార్టీ కోసం ఇన్నాళ్లుగా కష్టపడుతున్న ఇంతవరకు ఏపదవి తీసుకోలేదు. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేగా పోటిచేయాలని దృడ నిశ్చయంతో కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చిన నేనున్నాను అంటూ ఆర్థిక సహయం చేస్తూ భరోసా కల్పిస్తున్నారు. పార్టీ టికెట్ ఆశిస్తున్న మరోవ్యక్తి జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్. కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం మూలాన టికెట్ వస్తుందని ఆయన భావిస్తున్నారు.
ఇక బీజేపీ పార్టీ విషయానికొస్తే.. ఆపార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డితో పాటు దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎన్నారై సురేష్ రెడ్డి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో పార్టీకి అంతగా సానుకూల వాతావరణం కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ బలహీనంగా కనిపిస్తుంది. పార్టీ కార్యక్రమాలను సైతం తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ బలంగా కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరు అభ్యర్థులు పోటిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, ఓదెల మండల జెడ్పీటీసీ ఓదెల రాములు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో విజయరమణరావు పేరు నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తుంది. ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి కనిపిస్తుంది. కాకపోతే ఆర్థిక బలంలేరన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో ఆయన గనుక పోటిచేస్తే అధికార పార్టీకి కష్టమనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఇకపోతే కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న గంటరాములుకు ఒకటి రెండు మండలాల్లో మినహా.. మిగతా మండలాల్లో పట్టులేకపోవడం ఆయనకు మైనస్ గా కనిపిస్తుంది.