సాయి వంశీ ( విశీ) :
(బ్రో! మనుషులు మత గ్రంథాలను ప్రశ్నించకూడదట )
పవిత్ర గ్రంథం: ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను.
…. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను.
దక్షప్రజాపతి తన పదమూడు మంది కుమార్తెలను కశ్యపుడికి ఇచ్చి వివాహం చేశాడు. వారిలో దితి, అదితి ముఖ్యులు. కశ్యపుడికి దితి వల్ల రాక్షసులు, అదితి వల్ల దేవతలు పుట్టారు.
అదితి గర్భిణిగా ఉన్న సమయంలో కశ్యపుడు ఆమెను చూసి ‘ఈ జగానికి వెలుగును అందించే మహాత్ముడు నీ కడుపున పుడతాడు’ అని అన్నాడు. ఆ మాట విని అదితి చాలా సంతోషించింది. ఒక శుభముహూర్తంలో సూర్యదేవుడు ఈ లోకంలో అవతరించాడు. అతనికి ‘మార్తాండుడు’ అనే పేరు పెట్టారు.
సూర్యుడు లేకుండా వెలుగు ఎలా వచ్చిందని, పగలు రాత్రి తేడా ఎలా తెలిసిందని అడగొద్దు. సూర్యుడే ఇంకా పుట్టకుండా కశ్యపుడు తన భార్య అదితితో ఏ వెలుగులో మాట్లాడాడని అసలే అడగొద్దు.
బ్రో! ఇవి పురాణాలు. ఇలాగే ఉంటాయి. హ్యాపీడేస్‌లో శ్రావ్స్ డైలాగ్ మర్చిపోయావా? ఇది కూడా అంతే. మనుషులు మత గ్రంథాలను ప్రశ్నించకూడదు. విచిత్రమేమిటంటే, స్కూల్లో సైన్స్ చెప్పే టీచర్లు గుళ్ళలో, చర్చిల్లో వీటినే విని తలాడిస్తారు. ఎదురు చెప్పే ఓపిక లేక కొంతా, మనకెందుకులే అవన్నీ, నలుగురితో నారాయణా అంటే సరి అని అనుకోవడం వల్ల కొంతా! అంతా ఇంతే!