బండి సంజయ్ కుమార్,
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు,
బీజేపీ జాతీయ కార్యదర్శి..
గల్లీలో ఎవరున్నా…దేశ రక్షణ కోసం ఢిల్లీలో మోదీ ఉండాలని యావత్ భారత్ కోరుకుంటున్నది. ఈ నేపథ్యంలో దేశ హితం కోసం, రాష్ట్ర హితం కోసం, కరీంనగర్ ప్రజల హితం కోసం కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా ఈ నెల 10 నుంచి ప్రజా హిత యాత్రనై మీ ముందుకు వస్తున్నా. అహర్నిశలు శ్రమించి మన దేశాన్ని బలంగా తీర్చిదిద్దిన మోదీ ప్రభుత్వానికి, నా కరీంనగర్ బలగం సైతం అండగా ఉందని చాటి చెప్పడానికి వస్తున్నా. మీ ఆశీర్వాదం కోరుతూ… ప్రతి పల్లెకు, ప్రతి గడపకు మీ బిడ్డగా వస్తున్నా…
కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసిన తర్వాత మేడిపల్లి నుంచి మన ప్రజా హిత యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 15 వరకు వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో తొలివిడత యాత్ర సాగుతుంది. 119 కిలోమీటర్ల ఈ యాత్ర అనంతరం సిరిసిల్ల జిల్లా తంగళ్లల్లిలో తొలివిడత ముగింపు సభ ఉంటుంది. రెండో విడతలో మిగతా గ్రామాల్లో యాత్ర ఉంటుంది. నియోజకవర్గంలోని దాదాపు ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై సమస్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు, మోదీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంతో పాటు, బీజేపీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ చేస్తోన్న దుష్ప్రాచరాలను ఈ యాత్ర ద్వారా తిప్పికొడతాం.
దొందు దొందే…
స్వరాష్ట్రం సిద్ధించి పదేళ్లవుతున్నా తెలంగాణ బతుకు చిత్రం ఇప్పటికీ మారలేదు. తొమ్మిదున్నరేళ్లు పాలించిన బీఆర్ఎస్ తెలంగాణ ప్రజానీకాన్ని అనేక విధాలుగా వంచించింది. ఇంటికో ఉద్యోగం అని గద్దెనెక్కి పూటకో మాట మార్చి పబ్బం గడుపుకుంది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కుంభకోణంతో విద్యార్థుల కలల్ని నాశనం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3016 భృతి ఇచ్చి ఉంటే, ఊళ్ల నుంచి హైదరాబాద్ వెళ్లి చదువుకుంటున్న నిరుద్యోగుల కోచింగ్‌కు అది ఎంతోగానో సాయపడేది. కానీ, నాటి ప్రభుత్వం ఆ విషయాన్నే పట్టించుకోలేదు. ఇక, ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా తెలంగాణ పల్లెకు రాలేదు. దానిని మభ్యపెట్టడానికి, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పింది. ఒక్కరికీ ఆ ఆర్థిక సాయం అందలేదు. రైతులకు రూ. లక్ష వరకున్న పంట రుణాలు మాఫీ చేశామని, ఫోన్లకు సందేశాలు పంపించారు. బ్యాంకుకెళ్లి చూస్తే రైతన్నలకు రిక్త హస్తమే మిగిలింది.
ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత రీతిలో వేతన సవరణ జరగలేదు. పోడు భూములకు పట్టాలివ్వలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ మహిళా సంఘాలు, ఐకేపీ ఉద్యోగులకు అప్పగిస్తామని చెప్పిన హామీ నెరవేరలేదు. దళితబంధు కమీషన్ల పాలైంది. హైదరాబాద్ ఇస్తాంబుల్ కాలేదు. వరంగల్ డల్లాస్ కాలేదు. మన కరీంనగర్ లండన్ కాలేదు. అబద్ధపు హామీలతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి, రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసిన బీఆర్ఎస్ కుటుంబ పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు.
బీఆర్ఎస్, ఇప్పుడు దాని స్థానంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీలు దొందు దొందే అని అర్థం చేసుకోవడానికి తెలంగాణ ప్రజలకు ఎక్కువ సయమం పట్టలేదు. అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహించి ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. జనవరి 17లోపు డేటా ఎంట్రీ పూర్తి చేసి, పథకాలు అమలు చేస్తామని చెప్పి వాయిదాలతో వాయినమిస్తున్నది. డిజిటల్ యుగంలో దరఖాస్తులు తీసుకుని హడావిడి చేసిన కాంగ్రెస్ పార్టీ, ఆ దరఖాస్తులను ఏ మూలకు పడిసిందో తెలియని గందరగోళ పరిస్థితలను చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగే మాటల మాంత్రికుడని ప్రజలు తెలుసుకున్నారు. పంట సీజన్ వెళ్లినా… రైతులకు రైతుబంధు సాయం అందకపోవడం రేవంత్ మాటల గారడీకి మరో నిదర్శనం. దీంతో తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టయింది.
దేశం రక్షణే ధ్యేయంగా…
గతంతో పోలిస్తే 2014లో బీజేపీ అధికారంలోకి రావడంతో… సరిహద్దులో భద్రత పెరిగింది. సైన్యం గతంలో ఎన్నడూ లేనంత దూకుడు ప్రదర్శిస్తోంది. ఎంతోమంది ఉగ్రవాదులను ఏరి పారేయడంతో, దేశంలో ఉగ్రదాడులు తగ్గాయి. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ లో అల్లర్లు, అంతర్గతంగా దాడులు తగ్గిపోయాయి. దీంతో ప్రభుత్వాలు అభివృద్ధి పనులపై దృష్టి సారించేందుకు, పౌరులు సుఖశాంతులతో జీవించేందుకు మార్గం సుగమైంది. పదేళ్ల కింద లోక్ సభ ఎన్నికల సమయంలో భద్రతా లోపాలతో దేశంలో ఐపీఎల్ టోర్నమెంటు కూడా నిర్వహించలేకపోయారు. కానీ, ప్రభుత్వం బలంగా ఉన్నపుడు ఐపీఎల్, రామనవమి, రంజాన్, పరీక్షలు… ఇలా అన్నీ శాంతియుతంగా సాగుతాయని నిరూపించిన మోదీ ప్రభుత్వం మన స్వాతంత్ర భారతానికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది.
అనేక సంస్కరణలు…
మోదీ ప్రభుత్వ హయంలో మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ప్రగతి ప్రయాణం చేస్తోంది. మోదీ నాయకత్వంలో గత పదేళ్లలో ఎదురైన ప్రతి సవాలునూ వెనకడుగు వేయకుండా ఎదుర్కొన్నాం. కోవిడ్ మహమ్మారితో విజయవంతంగా పోరాడాం. వ్యాక్సీన్ కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితిని అధిగమించి ప్రపంచ దేశాలకు ఏకంగా మనమే వ్యాక్సీన్ అందించాం. అంతరిక్ష, రక్షణ రంగాల్లో చరిత్రత్మాక విజయాలు సాధించాం. దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన ఒకే దేశం- ఒకే పన్ను విధానం బీజేపీ హయాంలో అమల్లోకి వచ్చింది. ముస్లిం స్త్రీలకు శాపంగా మారిన ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధించింది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన ఎస్సీ వర్గీకరణను కూడా మోదీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి వారి కల సాకారం చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.
శతాబ్దాల కల సాకారం…
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ చేయడం ద్వారా శాతాబ్దాల భారతీయుల కలను నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రామరాజ్యానికి తలుపులు తెరిచారు. బీజేపీ ఇచ్చిన మాట ప్రకారం ఈ అపూర్వ ఘట్టాన్ని పూర్తి చేయడం గర్వకారణం. ఇక, 100 శాతం పల్లెలకు రోడ్లు, 100 శాతం ప్రజలకు బ్యాంకు అకౌంట్లు, 100 శాతం మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు, 100శాతం ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందించాలనే సంకల్పం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రతో పరిపూర్ణమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలతో పాటు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్, ఆత్మనిర్భర్ భారత్ వంటి అభివృద్ధి పథకాలు 140 కోట్ల మంది ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చింది. కాంగ్రెస్ కుటుంబ పాలనలో దేశం కుంభకోణాల్లో ఇరుక్కుని, ఆర్థికంగా చితికిపోయిన దశలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదాలకు సబ్ కా ప్రయాస్ నినాదంతో నవభారతదేశాన్ని నిర్మిస్తోంది. అనేక విప్లవాత్మక నిర్ణయాలతో మోదీ ప్రభుత్వానికి విశ్వసనీయత పెరిగింది.
సదా మీ సేవలో…*
మీలో ఒకడినైన నన్ను మీ ఓటుతో కరీంనగర్ ఎంపీగా ఎన్నుకున్న కరీంనగర్ ప్రజలకు సదా నేను రుణపడి ఉంటాను. మీరు ఇచ్చిన అవకాశమే నాకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పదవి కట్టబెట్టింది. మీరు ఇచ్చిన అవకాశంతోనే మోదీ సైనికుడిగా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి రాష్ట్రంలో బీజేపీ విస్తరణకు కృషి చేశాను. మీరు ఇచ్చిన అవకాశంతోనే రాష్ట్రంలో నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాను. కానీ, కరీంనగర్ గడ్డపై పుట్టిన ఈ బిడ్డ… కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులేమీ తేలేదని కొంతమంది పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు. అబద్ధాలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. విజ్ఞులైన కరీంనగర్ ప్రజలు ఆ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసి, నాకు మద్దతుగా నిలవడం నా అదృష్టం. అయినా, ఈ ఐదేళ్లలో నా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు నేనేం చేశానో బాధ్యతగా వివరిస్తాను.
మోదీకి కరీంనగర్ మీద ఉన్న అనేకసార్లు స్వయంగా మీరే చూశారు. నన్ను ఎంపీగా ఎన్నుకున్న నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ కోసం 12 వేల కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసింది. వీటిలో రహదారుల నిర్మాణానికి రూ.5 వేల కోట్లకు పైగా నిధులు సాధించగలిగాను. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి (ఎన్.హెచ్-563)రూపురేఖలు మార్చేలా నాలుగు వరుసల విస్తరణ కోసం రూ.2147 కోట్లు, కరీంనగర్- జగిత్యాల రోడ్డు విస్తరణ కోసం రూ. 1900 కోట్ల ప్రాజెక్టుని మంజూరు చేయించాను. ఇదే సమయంలో మన పార్లమెంటు పరిధిలో ఎల్కతుర్తి నుంచి సిద్ధిపేట వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు రూ.578 కోట్లు తెచ్చాను. అధ్వాన్నంగా మారిన కరీంనగర్-వరంగల్ మార్గంలో గుంతల్ని పూడ్చడానికి తాత్కాలిక మరమ్మత్తుల కోసం రూ. 41 కోట్లు మంజూరు చేయించాను. కరీంనగర్-చొప్పదండి మార్గంలో కరీంనగర్ రైల్వేస్టేషన్ దగ్గర రైల్వే గేటుతో ఎదురయ్యే ఇక్కట్లు తొలగించేందుకు ఆర్ఓబీ ఏర్పాటు కోసం కేంద్రం నుంచి రూ.100 కోట్లు తీసుకొచ్చాను.
కోవిడ్ మహమ్మారి సమయంలో జిల్లా ఆస్పత్రికి ఎంపిలాడ్స్ కింద ప్రత్యేక నిధులు ఇచ్చాను. కరోనా వారియర్స్ కి , హాస్పిటల్ సిబ్బందికి, పిపిఈ కిట్లు, మాస్కులు, వైద్య పరికరాలను అందించాను. పార్లమెంట్ పరిధిలోని ఆస్పత్రులకు 3 కోట్ల విలువైన సామాగ్రిని, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆంబులెన్సులను ఇచ్చాను. ఉపాధి హామీ పథకం కింద రూ. 5.33 కోట్లతో వివిధ పనులకు నిధులు సమకూర్చాను. ఎంపి నిధులు రూ. 5 కోట్లతో ఆయా గ్రామాల్లో, పలు పట్టణాల్లో, వార్డులలో అభివృద్ధికి అండగా నిలబడ్డాను. రూ.33 కోట్ల అర్బన్ నిధులతో జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశాను.
సీఆర్ఐఎఫ్ కింద పార్లమెంట్ పరిధిలోని వివిధ మండలాల అనుసంధాన రోడ్ల కోసం రూ. 205 కోట్ల నిధులను మంజూరు చేయించాను. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా మారుమూల గ్రామాలకు రోడ్లు మరియు బ్రిడ్జిలు వేసేందుకు రూ. 116 కోట్లు మంజూరు చేయించాను. ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ విద్యార్థులకు Central institute of Tool Design Extension Centre కోసం రూ.20 కోట్లు మంజూరు చేయించాను. కరీంనగర్ నగర అభివృద్ధికై రూ.198 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు మంజూరు చేయించాను. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అభివృద్ధి పనులకు, లబ్దిదారులకు కొన్ని వందల కోట్ల రూపాయలు అందేలా చొరవ తీసుకున్నాను.
సమిధనై వస్తున్నా…
అభివృద్ధి, సంక్షేమం, భద్రత విషయంలో మోదీ గ్యారంటీల ద్వారా మన దేశం, మన భవిష్యత్తు సురక్షిత హస్తాల్లో ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే జీ-20 దేశాలకు నేతృత్వం వహించిన భారత్ రాబోయే 25 ఏళ్ల అమృత కాలంలో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడానికి, విశ్వగురువుగా అవతరించడానికి ఢిల్లీ కోటకు కాశాయ రక్షణ కవచం కావాలి. కుటుంబ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చీడను వదిలించుకోవాలి.దేశ హితం కోసం అబ్‌కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ సర్కార్ నినాదంతో… మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకై జరుగుతున్న ఈ మహాయాగంలో మరోసారి సమిధగా మారడానికి మీ కరీంనగర్ మీ బిడ్డ సిద్ధమయ్యాడు. మీ చేతిలో రెపరెపాలాడే కాశాయ జెండాగా మారడానికి, మీ ఆశీస్సుల కోసం ప్రజాహిత యాత్రగా మీ గడపకొస్తున్నాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ…