టీఆర్ఎస్ అంతం బీజేపీతోనే సాధ్యం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా :రాజగోపాల్

తెలంగాణ వ్యాప్తంగా సంచలనాలకు కేంద్రబిందువైన మునుగోడు ఉప ఎన్నిక ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నిజాయితీకి మారుపేరైనా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాత్సరం చేయకుండా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని.. ఏ పార్టీలో చేరేది వారే నిర్ణయిస్తారని రాజగోపాల్ స్పష్టం చేశారు.

అవమానాలు భరించలేను..

ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై రాజగోపాల్ హాట్ కామెంట్స్ చేశారు. 20 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీని తిట్టిన వ్యక్తి చెప్తే మేము విన్నాలా అంటూ మండిపడ్దారు.కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణ కోసం పోరాడిన వాళ్లకు గౌరవం ఉండొద్దా అని ప్రశ్నించారు. రాజీనామా నిర్ణయం స్వార్థం కోసం తీసుకున్నది కాదని స్పష్టంచేశారు.
పార్టీలో అవమానాలు భరిస్తూ ఉండలేనని.. రాహుల్‌, సోనియాగాంధీ అంటే ఎనలేని గౌరవమని.. కానీ కొన్ని నిర్ణయాల వలన పార్టీకి నష్టం జరుగుతుందన్నారు రాజగోపాల్.

అధికారంలోకి వచ్చేది మోదీ ప్రభుత్వం..
దేశంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలో రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు రాజగోపాల్.అధికార టీఆర్ఎస్ అరాచక పాలనను బీజేపీ అంతం చేయగలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. ప్రజలకు మేలు కలుగుతుందన్న తన నిర్ణయాన్ని మునుగోడు నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. రాజీనామా నిర్ణయం ఎవరికైనా బాధిస్తే క్షమించండని విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియాలో దుష్ప్రచారం..
మునుగోడు ప్రజల కోసం రాజీనామాకు సిద్ధపడితే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యమని..ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించే సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలో కలుపుకున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో భూ నిర్వాసితులకు న్యాయం జరగలేదని..పేదలకు ఇళ్లు.. దళితబంధు..రోడ్లకు నిధులు ఇవ్వలేదన్నారు.

సీఎం కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్కవర్గం సంతోషంగా లేదన్నారు రాజగోపాల్.అధికార యంత్రాంగమంతా కేసీఆర్‌ అదుపులో ఉందన్నారు. ప్రజాప్రతినిధులతో పనులు చేయించి బిల్లులు మంజూరు చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద అడ్డగోలుగా అప్పులు చేశారని మండిపడ్డారు.టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోయినట్లు .. తన రాజీనామాతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నట్లు రాజగోపాల్ కుండబద్ధలు కొట్టారు.

మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికకు సమరశంఖం పూరించారు రాజగోపాల్. ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని..తెలంగాణను కుటుంబ పాలన నుంచి విముక్తి చేయాలంటే మోదీ_షా ద్వయంతోనే సాధ్యమని చెప్పకనే చెప్పారు రాజగోపాల్ రెడ్డి.