‘సన్ రైజర్స్’ ఆరో ఓటమి!

ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా ఆరో ఓటమిని చవిచూసింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో ఆజట్టు 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(124; 64 బంతుల్లో 11×4, 8×6) శతకంతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌(48; 33 బంతుల్లో 4×4, 2×6) రాణించాడు. చివర్లో రియాన్‌ పరాగ్‌(15), డేవిడ్‌ మిల్లర్‌(7) నాటౌట్‌గా నిలవడంతోరాయల్స్ జట్టు 221 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ ముందుంచుంది. హైదరాబాద్‌ బౌలర్లలో రషీద్‌, విజయ్‌ శంకర్‌, సందీప్‌ శర్మ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. అనంతరం 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ 165 పరుగులకే పరిమితమైంది. దాంతో 55 పరుగుల తేడాతో రాయల్స్ జట్టు నెగ్గింది. లక్ష్య ఛేదనలో మనీశ్‌ పాండే(31; 20 బంతుల్లో 3×4, 2×6), జానీ బెయిర్‌స్టో(30; 21 బంతుల్లో 4×4, 1×6), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(20; 21 బంతుల్లో 1×4)ఓ మోస్తారు పరుగులు సాధించారు. రాజస్థాన్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్‌, క్రిస్‌మోరిస్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, కార్తీక్‌ త్యాగి, రాహుల్‌ తెవాతియా తలా ఓ వికెట్‌ తీశారు.