‘బెంగుళూరు’ విక్టరీ!

ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా నాలుగు మ్యాచ్లో గెలిచి పాయింట్లు పట్టి కలో అగ్రస్థానంలో నిలిచింది. గురువారం వాఖండే వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ని 10 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.  టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ జట్టును ఆదుకున్నారు. శివమ్‌ దూబె (46; 32 బంతుల్లో 5×4,  2×6), రియాన్‌ పరాగ్‌ (25; 16 బంతుల్లో 4×4), రాహుల్‌ తెవాటియా (40; 23 బంతుల్లో 4×4, 2×6) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్‌, సిరాజ్‌ మూడేసి వికెట్లు తీయగా రిచర్డ్‌సన్‌, జేమీసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తలా ఓ వికెట్‌ తీశారు. అనంతరం బెంగుళూరు 179 పరుగుల భారీ లక్ష్యాన్ని  ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు దేవ్‌దత్‌ పడిక్కల్‌(101నాటౌట్‌; 52 బంతుల్లో 11×4, 6×6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(72నాటౌట్‌; 47 బంతుల్లో 6×4, 3×6)చెలరేగడంతో బెంగుళూరు సునాయాసంగా విజయం సాధించింది.

వీరిద్దరూ ఓవర్‌కు పది పరుగులకు పైగా చేస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దాంతో ఆర్సీబి 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసింది. అంతేకాకుండా ఆర్సీబి కెప్టెన్ కోహ్లీ ఐపీఎల్లో 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ కొత్త రికార్డు నెలకొల్పాడు.