విశీ ( సాయి వంశీ) :
సరైన పుస్తకాలు చదవకుండా, కేవలం సినిమాలు చూసి వాటినే అసలైన చరిత్ర అని ఉద్రేకపడేది మనమే! ఈ కారణంగానే మనకు బోలెడంత మంది చారిత్రక పురుషులు, మగ స్వాతంత్ర్య సమరయోధుల సినిమాలు వచ్చాయి. వారి దృష్టికోణం ఎలా ఉంటే మనకు స్వాతంత్ర్యం అలా అర్థమైంది. We deserved it. చరిత్ర పట్ల గౌరవం, ఉత్సాహం లేక వాట్సప్‌ని మాత్రమే నమ్ముతున్న మనకు ఇలా జరగాల్సిందే!
ఇప్పుడు ‘రజాకార్’ సినిమా వస్తుంది. సినిమా చూడకుండా సినిమా లోపల ఏముందో మనం విమర్శించకూడదు. కానీ ట్రైలర్, పోస్టర్ చూస్తే కొంత అర్థం అవుతుంది. నిజాం ప్రభుత్వం, తెలంగాణ ప్రజలకు మధ్య జరిగిన పోరాటాన్ని హిందూ-ముస్లిం మతాల మధ్య గొడవలా మార్చి చూపిస్తారా అనే అనుమానం అందరిలో ఉంది. అనుమానం ఏమిటి, అదే నిజం అని కొందరు నిర్ధారిస్తున్నారు.
తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుడు దొడ్డి కొమురయ్య ఎవరి తుపాకీ గుండుకు బలయ్యాడు? నిందితులది ఏ వర్గమో చెప్పాలా? నెపం మొత్తం ముస్లింల మీదకు తోయాలా? చాకలి ఐలమ్మను ఇబ్బందులకు గురి చేసిన విసునూర్ దేశ్‌ముఖ్ ఏం వర్గమో ఇప్పుడు చెప్పాలా? నెపం మొత్తం ముస్లింల మీదకు తోయాలా? రజాకార్లతో సమానంగా స్త్రీల చేత నగ్నంగా బతుకమ్మ ఆడించిన గడీలు ఎవరివో, ఏ వర్గానివో చెప్పాలా? చరిత్ర పుటలు తిరిగేయాలా? “ఏంట్రా! అమ్మా అంటావ్..నీ అయ్యకు పెళ్లాన్నా?” అని గద్దించిన రాపాక జానమ్మ ఏ వర్గమో చెప్పాలా? ఆమె కొడుకు రామచంద్రారెడ్డి దురాగతాలు నైసుగా మరవాలా? మూడు రోజుల బాలింతను కూడా పొలం పనులకు రమ్మని, పిల్లలకు పాలు ఇవ్వాలంటే మోదుగదొప్పలో పాలు పిండి చూపించమన్నది ఎవరో, ఏ వర్గమో చెప్పాలా? నిరూపించాలా?
‘రజాకార్’ తర్వాత ‘విసునూరు’ అనే సినిమా వస్తుందా? ఆ వర్గం వారు పడనిస్తారా? నాటి నెత్తుటి మరకలు కడుక్కోవడానికే కదా ఈ సినిమాలు, ఈ కోణాలు. అప్పటి తప్పులు జనానికి తెలియకూడదనే ఈ తిప్పలు. మొత్తం నెపం తీసుకెళ్ళి ముస్లింల మీదే రుద్దితే సరి! మరి ఈ సంస్థానాధీశులందరూ హిందువులే అయినా నిజాం రాజుకు సామంతులుగా ఉన్నారు. ఎందుకు వ్యతిరేకించలేదు? ఎందుకు పోరాడలేదు? నిజాం దురాగతాలను ఎందుకు సహించారు? తమ సంస్థానం, తమ ఆస్తులు తమ చేతిలో ఉంటే చాలని ఎందుకు ఊరుకున్నారు? నిజాలు లెక్క తేల్చాలా?
యూదుల వల్లే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందని చెలరేగిన పుకారు హిట్లర్ కోపానికి కారణమైంది. ఆ దేశంలో ఏ చిన్న తప్పు జరిగినా యూదులే కారణమనే స్థితికి చేర్చింది. హిట్లర్ నియంతృత్వం దాదాపు అరవై లక్షల మంది యూదులను పొట్టన పెట్టుకుంది. హిట్లర్ క్యాథలిక్. చర్చిలో అతనికి బాప్తిసం కూడా ఇచ్చారు. ఒక దశలో ఆయన చర్చి ఫాదర్ అవ్వాలని అనుకున్నాడని అంటారు. అయితే ఆ తర్వాత ఆయన పెద్దగా తన మతం పట్ల ముఖ్యత్వం చూపిన దాఖలా లేదు. ఇప్పుడు ఆ అరవై లక్షల మంది చావును క్యాథలిక్-యూదు మతాల గొడవగా చూడాలా? హిట్లర్ అధికార మదం, నియంతృత్వం, క్రూర స్వభావంగా చూడాలా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే నిజాం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జరిగింది హిందూ-ముస్లిం మతాల గొడవా లేక నిరంకుశుడైన రాజు, పౌరుల మధ్య గొడవా అనేది తేలుతుంది.
సినిమాలు చూసి చరిత్రను అంచనా వేస్తే, వీరప్పన్‌ని కూడా వీరపాండ్య కట్టబ్రహ్మనగా, నిజాం రాజును ఏమీ తెలియని అమాయకుడిగా మార్చి చూపే ఘనులున్నారు మన దగ్గర. తస్మాత్ జాగ్రత్త!!