‘ఆడుకాలం’ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు ‘వెట్రిమారన్’. కోలీవుడ్ నటుడు ధనుష్ హీరోగా ఆయన తీసిన ‘అసురన్’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగులో ‘నారప్పన్’ గా రీమేక్ చేశారు. ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘విడుదల పార్ట్ – 1’. తమిళ హస్య నటుడు సూరి హీరోగా నటించాడు. విజయ సేతుపతి ప్రత్యేక పాత్రలో కనిపించారు. తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈచిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. శనివారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం!
కథ…
తమిళ నాడు ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను నిరసిస్తూ “ప్రజాదళం” అడ్డుకుంటుంది. దళం నాయకుడైన పెరుమాళ్( విజయ్ సేతుపతి)ను పట్టుకోవడానికి ‘ఆపరేషన్ గోస్ట్ హంట్’ పేరుతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపడతారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన కుమరేషన్(సూరి) ప్రత్యేక పోలీసుల దళం డ్రైవర్ గా నియమించబడతాడు. అనుకోకుండా అడవిలో ఓమహిళపై ఎలుగుబంటి దాడి చేయడంతో కాపాడేందుకు పోలీస్ వాహనాన్ని వాడతాడు. దీంతో పై అధికారుల అతన్ని తప్పుపడుతూ.. క్షమాపణలు చెప్పమంటారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కుమరేషన్.. ససేమిరా క్షమాపణలు చెప్పనంటాడు. ఈక్రమంలోనే పాప అలియాస్ తమిళరసి(భవాని శ్రీ)తో పరిచయం కాస్త ప్రేమకు దారితీస్తుంది. చివరకు పెరుమాళ్ పోలీసులకు చిక్కాడా? తమిళరసి- కుమరేషన్ ప్రేమ ఫలించిందా? సునీల్ మీనన్( గౌతమ్ వాసుదేవ్ మీనన్) పాత్రేంటి? తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే?
ఎలా ఉందంటే..
విభిన్నకథలు, పాత్రలకు పెట్టింది పేరు వెట్రిమారన్. అతని సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. ఈసినిమా సైతం అదే కోవకు చెందింది. 1987 నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రజాదళం నాయకుడిని పట్టుకునే క్రమంలో.. దళాలకు, పోలీసులకు మధ్య జరిగే పోరాటాలు.. వాళ్ల మధ్య సామన్య ప్రజానీకం పడే ఇబ్బందులు తెలుగు సినిమాల్లో చూశాం. కాకపోతే సహజత్వాన్ని తెరపైకి తీసుకొచ్చే క్రమంలో ఇంతకు ముందు చూసిన సన్నివేశాల కంటే కొంచెం ముందుకు వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది.స్త్రీ, పురుషులు బేధం లేకుండా దుస్తులు విప్పించే దృశ్యాలు తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరేమో అనిపించింది. ఇక ప్రేమకథలో కొత్తదనం అంటూ ఏమిలేదు. సమాజంలో నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కిందిస్థాయి పోలీస్ ఉద్యోగి జీవితం.. ఉన్నతాధికారుల తీరు ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించారు. క్లైమాక్స్ ట్విస్ట్ తో పార్ట్ -2 పై ఆసక్తి పెంచేలా చేశారు.
ఎవరెలా చేశారంటే…
హస్యనటుడు సూరిలోని కొత్తకొణాన్ని వెలికితీశారు దర్శకుడు వెట్రిమారన్. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు సూరి. హీరోయిన్ భవానీ శ్రీ సైతం సూరితో పోటిపడి నటించింది. అమాయక పాత్రలో ఇద్దరు జీవించేశారు. విజయ్ సేతుపతి కనిపించేంది కొన్ని సన్నివేశాలే అయినా.. అతని పాత్ర సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. ప్రత్యేక పాత్రలో నటించిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ , రాజీవ్ మీనన్ , చేతన్ తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతికత పనితీరు..
కథ ఆధారంగా పాత్రలను బలంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడి పనీతీరు కనిపిస్తుంది. సెకండ్ పార్ట్ ఉండటంతో సస్పెన్స్ లో పెట్టి ఫస్ట్ పార్ట్ సాగదీసినట్లు అనిపించింది. కథనం పరంగా ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్. మ్యూజిక్ పరంగా ఇళయారాజ బాణీలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
“చివరగా ప్రతి సమస్యకు ఆత్మహత్యే శరణ్యమని భావించే వాళ్ళు చూడాల్సిన సినిమా”
రేటింగ్ : 3.25/ 5