Telanganaelections2023: తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదని రేవంత్ ఆరోపించారు.
“తెలంగాణ వచ్చి పదేళ్లయినా బోథ్ కు నీళ్లేందుకు రాలేదు? ఇక్కడి ప్రజలకు పోడు భూములకు పట్టాలు ఎందుకివ్వలేదు? తండాలను పంచాయితీలు చేశామని చెప్పుకునే కేసీఆర్ ఎన్ని పంచాయతీలకు భవనాలు కట్టించారు? గ్రామసర్పంచులకు వేల కోట్ల బకాయిలు ఇవ్వక ప్రభుత్వం వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పింది. కేసీఆర్ తన మేధస్సును రంగరించి కాళేశ్వరం కట్టిన అని చెప్తుండు..కట్టిన మెడిగడ్డ మూడేళ్లలో కుంగిపోయింది… అన్నారం పగిలిపోయింది.బోథ్ కు నీళ్లు రాకపోవడానికి ఈ దద్దమ్మ సీఎం కేసీఆరే కారణం. ఇక్కడి కుఫ్టీ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి బోథ్ కు డిగ్రీ కాలేజీ రావాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ గెలవాలి..ఒక్కసారి ఈ బోథ్ గడ్డపై కాంగ్రెస్ ను గెలిపించండి.. డిసెంబర్ 31లోపు బోథ్ ను రెవెన్యూ డివిజన్ చేసే జిమ్మేదారి నాది” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆదివాసీలు , లాంబాడాలు కాంగ్రెస్ కు రెండు కళ్లలాంటివారు.తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాల్లో 6 లాంబాడాలకు, 6 ఆదివాసీలకు ఇవ్వాలని నిర్ణయించింది. బలరాం నాయక్ పెద్దమనసుతో ఆదివాసీ బిడ్డకోసం ఇల్లందు సీటు వదులుకుండు పదవి కంటే ప్రజలకు మేలు జరగడం ముఖ్యమని ఆయన తన ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసారని రేవంత్ రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ నుంచి అచ్ఛంపేట అడవుల వరకు కాంగ్రెస్ ను గెలిపించండి..ఆదిలాబాద్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాందొరలపాలన పోవాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలి అన్నారు రేవంత్ రెడ్డి. అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేది. మోదీ, కేసీఆర్ కలిసి ప్రస్తుతం ఆ ధరను రూ.1200 చేశారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం అని రేవంత్‌రెడ్డి అన్నారు.