Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 26 నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రం నుండి మలిదశ యాత్ర ప్రారంభించనున్నారు. ప్రతిరోజు సగటున 10 గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించాలని నిర్ణయించిన బండి సంజయ్ 26 నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
తొలిరోజు కోహెడ మండలంలో ప్రారంభమయ్యే యాత్ర తీగలగుంటపల్లి, గోటమిట్ల, నారాయణపూర్, విజయనగర్ తోపాటు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, చిన్న ముల్కనూర్, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేస్తారు. రాత్రి బొమ్మనపల్లి సమీపంలోని ప్రైవేట్ స్కూల్ లో బస చేస్తారు. రెండోరోజు హుస్నాబాద్ రూరల్ మండలంలోని మహ్మదాపూర్, నాగారం, పోతారం, హుస్నాబాద్, పందిళ్ల, గోవర్ధనగిరి, రామవరం, అక్కన్నపేట, అంతక్కపెట, కట్కూర్, మల్లారం, కొత్తకొండ గ్రామాల్లో పర్యటిస్తారు. 3వ రోజు భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో, 4, 5 రోజుల్లోఇల్లందకుంట, జమ్మికుంట రూరల్, జమ్మికుంట టౌన్, హుజూరాబాద్ రూరల్ మండలాల్లో 6వ రోజు సైదాపూర్, వీణవంక మండలాల్లో యాత్ర చేస్తారు. మార్చి 2 నాటికి హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ప్రజాహిత యాత్రను పూర్తి చేసేలా రూట్ మ్యాప్ రూపొందించారు.
అందులో భాగంగా ఈరోజు బండి సంజయ్ కుమార్ బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ఇంఛార్జ్ మీసాల చంద్రయ్య, మాజీ మేయర్ డి.శంకర్, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రజాహిత యాత్రకు సంబంధించి వివిధ విభాగాల బాధ్యులతో యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా యాత్ర విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన కార్యక్రమాలపై బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు.