హైదరాబాద్:
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సమ్మక్క సారక్క వనదేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.., పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. గతం కంటే ఈ సారి చాలా ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం కాన్ఫరెన్స్ రూంలో మేడారం మాస్టర్ ప్లాన్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశం మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో జరగ్గా… మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎండోమెంటు ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామాయ్యర్, ములుగు కలెక్టర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. పలుమార్లు కుంభమేళలు నిర్వహించిన సంస్థకు మాస్టర్ ప్లాన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్టు అధికారులు మంత్రులకు వివరించారు. సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనల మేరకు మేడారం దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్ ను మంత్రులు ప్రత్యేకంగా పరిశీలించారు. డిజైన్లలో చేయాల్సిన మార్పులపై మంత్రులు సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహా మేడారం జాతరలోపు పూర్తి చేయాల్సిన పనులను త్వరగా చేపట్టాలని మంత్రులు సూచించారు. సమ్మక్క సారలమ్మ పూజారులతో చర్చించి వారి అభిప్రాయం మేరకు ఆధునికరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. భక్తుల సందర్శనార్థం అమ్మవారి గద్దెల ఎత్తు పెంచాలని పూజారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా… తగిన మేరకు డిజైన్లు మార్చాలన్నారు. భక్తుల సందర్శనార్థం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలు ఒకే వరుస క్రమంలో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా ఎలాంటి జాప్యం లేకుండా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను భక్తులు దర్శించుకునేందుకు అనువుగా ఉంటుందని మంత్రులు చెప్పారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమ్మక్క సారలమ్మ సేవ కోసం జాతర సమయంలో భక్తులకు సహాయపడేందుకు వాలంటీర్లను నియమించాలన్నారు. ఆదివాసి సంస్కృతి సాంప్రదాయ బద్ధంగా మేడారం పరిసరాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. మేడారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మహా మేడారం జాతరకు రూ. 150 కోట్లు ప్రజా ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. అవసరమైతే ఇతర శాఖల సహాయంతో మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. జాతర నిర్వహణ ఏర్పాట్లు, మేడారం మాస్టర్ ప్లాన్ డిజైన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి… ఆయన అనుమతి తీసుకున్న తర్వాత ముందుకు వెళతామన్నారు. మేడారం అభివృద్ధి ప్రతి దశలో పూజారుల ను భాగస్వామ్యం చేస్తామన్నారు.
సమ్మక్క సారలమ్మల త్యాగాన్ని ఔన్నత్యాన్ని మరింత చాటి చెప్పే విధంగా మేడారం ఆలయ ప్రాంగణాన్ని సిద్ధం చేస్తామన్నారు. సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తుందని మంత్రులు చెప్పారు. దేశ విదేశాల నుంచి వచ్చే వారి కోసం సకల సౌకర్యాలు కల్పించేందుకు పట్టిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు జరిగితే మేడారం జాతర మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతర సమయంలో వెహికల్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా డిజైన్‌లు రూపకల్పన చేయాలన్నారు. ఫ్యూరిఫైడ్ వాటర్ అందించాలని మంత్రి సురేఖ సూచించారు. బెల్లం కింద పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి సలహానిచ్చారు. బ్యాటరీ వెహికల్స్ ను వినియోగించుకోవాలన్నారు. క్రౌడ్ మేనేజ్ మెంటుకి ఏఐ ఎనబుల్డ్ కెమోరాలను ఉపయోగించాలన్నారు. సేవా పద్ధతిన భక్తులను మ్యాన్ పవర్ కింది వినియోగించుకోవాలన్నారు. వనజాతర వస్తున్న తరుణంలో దారి పొంటి ఉన్న టెంపుల్స్ ను కూడా అవసరమైన మేరకు అలంకరణ చేయాలన్నారు. ఈ క్రమంలో భక్తులు ఆయా టెంపుల్‌లను దర్శించుకుంటారని మంత్రి సురేఖ చెప్పారు. జాతర వెళ్ళే దారి ఇందిరా మహిళా క్యాంటీలను ద్వారా తినుబండారాలను అందే విధంగా చూడాలన్నారు. అవసరమైతే అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలను వివిధ ప్రదేశాల్లో ఉపయోగించుకొని తగు సేవలు భక్తులకు అందజేయాలన్నారు. జాతర విజయవంతం రహదారులపై ఆధారపడి ఉంటుందని… అందుకే, మేడారం – ఊరట్టం, మేడారం – కన్నెపల్లితో పాటు మరో నాలుగు మార్గాల విస్తరణ పనులు చేపడుతున్న వివరాలు మంత్రులకు అధికారులు తెలిపారు. నేషనల్ హైవే అధికారులతో అవసరమైతే మరొకసారి రివ్యూ చేయాలని మంత్రులు నిర్ణయించారు. సమ్మక్క, సారక్క అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పూర్వం నుంచి చోటుచేసుకున్న మార్పులు, పూజారుల ప్రమేయం, అంగీకారంతోనే చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని… మాస్టర్ ప్లాన్ లో భాగంగా దాన్ని క్రమబద్దీకరించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. డిసెంబర్ వరకు ఎంతమేరకు వర్కులు పూర్తవుతాయో చెప్పాలన్నారు. మాస్టర్ ప్లాన్‌లో మొత్తం రెండు ఫేజ్‌లు గా స్థానికంగా అభివృద్ధి పనులు చేపడుతున్నరని అన్నారు.
మొత్తం రూ. 236.2 కోట్లతో మాస్టర్ రూపొందించగా – అందులో పలు అంశాలకు కేటాయింపులు:
– గద్దెల అభివృద్ధికి రూ. 58.2 కోట్లు
– గద్దెల వద్ద కళాకృతి పనులకు రూ. 6.8 కోట్లు
– జంపన్న వాగు అభివృద్ధి కోసం రూ. రూ39 కోట్లు.
– భక్తుల అకామిడేషన్ నిమిత్తం రూ. 50 కోట్లు
– రోడ్ల అభివృద్ధి నిమిత్తం రూ. 52.5 కోట్లు
– మిగతావి ఇతరత్రా ఖర్చుల నిమిత్తం వెచ్చించనున్నారు.