Telanganaelections2023: ‘సమాజంలోని అన్ని వర్గాలకీ అధికారం అందాలనే బలమైన లక్ష్యంతో 2009 నుంచి పోరాటం చేస్తున్నామన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. తెలంగాణలో బీజేపీ కూడా అదే ఆశయంతో తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం ఎంతో ఆనందం కలిగించిందని ఆయన అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగిన జనసేన – బీజేపీ సంయుక్త ప్రచార సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా , జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సభలో పాల్గొన్నారు. కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జనసేనాని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దశాబ్ద కాలంలోనే 5వ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించిందన్నారు . తెలంగాణలోనూ భారత్ సాధిస్తున్న అభివృద్ధి జాడలు చూడాలని.. ఇది కచ్చితంగా తెలంగాణకు అవసరమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమని తేల్చిచెప్పారు. జనసేన పార్టీ శ్రీ రామచంద్రమూర్తిని గౌరవిస్తుందన్నారు. సకల మతాలను అంతే గౌరవంగా చూస్తుందన్నారు. సోషలిస్టు విలువలతోపాటు సమసమాజ స్థాపన ఆలోచనలు జనసేనకు ఉంటాయని.. ఇలాంటి భావాలు బీజేపీలోనే కనిపిస్తాయని అన్నారు. భారతదేశం భద్రంగా ఉండాలని బీజేపీ భావిస్తుందని.. మోదీ నాయకత్వంలో భారత దేశం ప్రపంచంలోనే అత్యున్నత దశకు పయనిస్తోందని పేర్కొన్నారు. జీ 20 వంటి ప్రతిష్టాత్మక సదస్సులకు భారత్ నాయకత్వం వహించడం ప్రపంచంలోని సంపన్న దేశాలకు చెందిన అధినేతలు భారత్ కు రావడం గర్వంగా అనిపించిందన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఇలాంటి సమగ్ర అభివృద్ధి కనిపించాలని బలంగా కోరుకుంటున్నట్లు పవన్ స్పష్టం చేశారు.