Poetry: ఆమె ఎంతటి గాఢనిద్రలో ఉందంటే..?

Panyalajagannathdas: 

సాహసించలేను..

ఆమె ఎంతటి గాఢనిద్రలో ఉందంటే,

ఆమెను మేల్కొలిపేందుకు
నేనిప్పుడు సాహసించలేను.
ఆమె మాయాజాలంలో చిక్కుకున్నట్లు
నా నాలుక పిడచగట్టుకుపోయింది.
నా మాటలు గొంతు పోగొట్టుకున్నాయి.

తననిలా చూడటానికి
నా రెండు కళ్లూ చాలవు.
తనను ముద్దాడటానికి
నా పెదవులిక నిరీక్షించలేవు.
ఇక ఓపలేని ఆత్రంతో
నా ఓపికను కోల్పోతున్నాను.

ఇలాంటప్పుడే,

ఒక అమరకవి ఇలా అన్నాడు-
నేను మరణించానే గాని,
నాలోని లౌకికానందానుభూతి మరణించలేదు.
జీవంలేని నా దేహంలోంచి
నా ఆత్మ సీతాకోకలా
స్వేచ్ఛగా ప్రియురాలిని చేరుకుంటుంది.

యోమద్‌ మూలం: మాగ్తిమ్‌గలీ
స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Optimized by Optimole