విశీ( సాయి వంశీ) :
“హూ! కమాన్..”
“హే! వద్దు ప్లీజ్!”
“ప్లీజ్! ఈ ఒక్కసారికి. ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా! ఇదే లాస్ట్ టైం. ప్లీజ్.. ప్లీజ్.. నాకోసం”
“ఎప్పుడూ ఇలాగే చెప్తావ్! వద్దంటున్నా ఇంతదూరం తీసుకొచ్చావ్! నాకిష్టం లేదు..”
“హే! నాకోసం. ప్లీజ్.. ప్లీజ్! మన లవ్ కోసం. నేనే కదా! ఏమీ కాదు. ప్లీజ్! కొంచెం సేపు.. జస్ట్.. కొంచెంసేపే! నువ్వు చేయకుంటే మన లవ్ మీద ఒట్టు. ప్లీజ్”
మొహం విసుగ్గా పెట్టింది. లాభం లేదు. వినడు. తన మాట నెగ్గేదాకా వదలడు. బతిమాలి, బుజ్జగించి, అలిగి, ఆవేశపడి.. ఏదోరకంగా సాధిస్తాడు.
మోకాళ్ల మీది కొలువుకు సిద్ధపడింది. అతను ఉత్సాహంగా ఉన్నాడు. కళ్లు మత్తుమత్తుగా వెలుగుతున్నాయి. తన్మయమా? తమకమా? తనకు మాత్రం రేగుముళ్లను పళ్ల కింద పెట్టి నములుతున్నట్టు ఉంది. భూగోళమంత చేదును నోటి నిండా నింపుకున్నట్టు ఉంది.
ఒకటి.. రెండు.. మూడు..
మూడు నిమిషాల్లో పని ముగిసింది. అతనికి తృప్తి. తనకి అసహ్యం. అతనికి సుఖం. తనకు ఏడుపు. అతనికి విజయగర్వం. తనకి అపరాధ భావం. నోరంతా గుప్పెడు వేపకాయలు నమిలినట్టుంది. గంపెడు కాకరకాయలు కసకసా కొరికినట్టు ఉంది. ఎంతసేపు కడిగితే ఈ చేదు పోతుంది?
“నువ్వు ఓవర్‌గా ఫీలౌతావ్ కానీ, మా ఫ్రెండ్స్‌వాళ్ల లవర్స్‌కి ఇదంతా కామన్. మా వాళ్లు వద్దన్నా సరే, ఆ అమ్మాయిలే అడిగి మరీ చేస్తారంట తెలుసా? ఏముంది అందులో? సో సింపుల్. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్” అన్నాడోసారి.
ఇట్స్ ఆల్ అబౌట్ లవ్వా? ఇది సింపులా? ఫినాయిల్, గెమాగ్జిన్, వేపనూనె, ఆముదం కలిపి నోట్లో వేసుకొని నిమిషం ఉండండి. తెలుస్తుంది. ముక్కు మూసుకోకుండా పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర ఓ గంటసేపు ఉండి రండి. తెలుస్తుంది. మగవాళ్ల ముళ్లకిరీటాలు మోయడానికి ఆడవాళ్లే తేరగా దొరుకుతారు. ఇలాంటి సంగతులు ఒకరికొకరు గొప్పగా చెప్పుకుంటారేంటి ఈ మగాళ్లు? ఇదేం స్నేహం?
మొదటిసారి అతను అడిగినప్పుడు అతి బలవంతం మీద ఒప్పుకుంది. ఒక్క నిమిషం.. ఒకే ఒక్క నిమిషం. వాంతొచ్చేసింది. రోజంతా ఏమీ తినబుద్ధి కాలేదు. మళ్లీ ఆ పని చేయొద్దని గట్టిగా అనుకుంది. ఆపైన పది రోజులకు మరోసారి. ఆపైన మరోసారి. వద్దన్న ప్రతిసారీ బుజ్జగింపులు.. సతాయింపులు.. అవే అవే ప్రమాణాలు.. ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్ అంటూ వేడుకోళ్లు. ప్రేమ మీద ఒట్లు. నీది నిజమైన ప్రేమేనా అనే అనుమానాలు, సాధింపులు.
ఇద్దరూ కలిసి ఊరి చివర ఎవరూ లేని చోటికి వెళ్తే ఇంతకుముందు సంతోషంగా ఉండేది. ఇప్పుడేంటో భయంగా ఉంటోంది. భయం కూడా కాదేమో? చేదుగా.. పరమ చేదుగా.. నోటి నిండా చేదుగా ఉంటోంది.
వాటర్ బాటిల్ తీసి చేతికిచ్చాడు. నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఊసింది. మరోసారి ఇంకొన్ని నీళ్లు పోసుకుని మరోసారి ఊసింది. మళ్లీ నోటి నిండా నీళ్లు నింపుకొని మొత్తం నోరంతా అరిగేలా పుక్కిలించి ఊసింది. బలంగా ఊసింది. కోపంగా ఊసింది. అతని మొహమ్మీద ఊయలేని తన స్థితిపై ఊసింది.
ఇంకోసారి.. మరోసారి.. బాటిల్ మొత్తం ఖాళీ అయ్యేదాకా అలా చేస్తూనే ఉంది. అయినా ఇంకా చేదు.. నోరంతా చేదు.. భరించలేని చేదు.. భయంకరమైన చేదు.. బాధపెట్టే చేదు.. ఏడుపు తన్నుకొచ్చే చేదు.. భూగోళమంత చేదు..
ఆ చేదు పోవడానికి ఇంకా ఎన్ని నీళ్లు కావాలో??