Rangamaarthaanda :  బ్రహ్మానందం ‘చక్రపాణి’ పాత్ర తెలుగు ప్రేక్షకులు కలకాలం గుర్తుపెట్టుకుంటారు..!

Rangamaarthaanda : బ్రహ్మానందం ‘చక్రపాణి’ పాత్ర తెలుగు ప్రేక్షకులు కలకాలం గుర్తుపెట్టుకుంటారు..!

విశీ( సాయి వంశీ) : 

మలయాళ సినీరంగంలో సలీమ్ కుమార్ అనే నటుడు ఉన్నారు. హాస్యానికి ట్రేడ్ మార్క్. 41 ఏళ్ల వయసులో ఆయన చేత ‘ఆదామింటె మగన్ అబు’ అనే సినిమాలో ప్రధాన పాత్ర చేయించారు దర్శకుడు సలీమ్ అహ్మద్. ఆయన పక్కన జోడీగా జరీనా వాహబ్. దర్శకుడిగా సలీమ్ అహ్మద్‌కు అదే తొలి సినిమా. హాస్యనటుడిగా పేరు పొందిన వ్యక్తి చేత అంత బరువైన పాత్ర చేయించాలని ఆయన అనుకోవడం నిజంగా సాహసమే!

కన్నడ సినీరంగంలో సీనియర్ నటి ఉమాశ్రీ. రంగస్థలం నుంచి సినిమా రంగానికి వచ్చి, హాస్య, సహాయక పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వ్యక్తి. 50 ఏళ్ల వయసులో ఆమె చేత ‘గులాబీ టాకీస్’ అనే సినిమాలో గులాబీ అనే ముస్లిం మహిళ పాత్ర చేయించారు దర్శకుడు గిరీష్ కాసరవెల్లి. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టూనే ఉంటుంది. ‘హాస్యానికి పేరుపొందిన నటికి అంత బరువైన పాత్రా?’ అని దర్శకుడు అనుకోలేదు.

దక్షిణాది భాషల్లో నటుడు నగేష్ అంటే తెలియని వారు ఉండరు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి, హాస్యంలో తనదైన ముద్ర వేశారు. ఎవరూ ఇమిటేట్ చేయలేని గొంతుతో అద్భుతమైన డైలాగులు పలకడం ఆయనకే చెల్లు. 60 ఏళ్ల వయసులో ‘నమ్మవర్’ అనే సినిమాలో ఆయన చేత ప్రొఫెసర్ పాత్ర చేయించారు దర్శకుడు కె.ఎస్.సేతుమాధవన్. కూతురు చనిపోయింది అనే విషయాన్ని నమ్మలేక సతమయ్యే సన్నివేశంలో నగేష్ గారి నటన చూసి తీరాలి. One of the Best Performances of an Indian Actors. తమిళ సినిమాల్లో చాలామందికి నేటికీ అదొక డ్రీమ్ రోల్.

యాదృచ్ఛికంగా, ఈ ముగ్గురికీ ఆ సినిమాలకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చాయి. గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. తెలుగులో టాప్ కమెడియన్‌గా పేరు పొందిన బ్రహ్మానందం గారు ‘రంగమార్తాండ’లో విజృంభించారు. ఎప్పుడూ వేయని పాత్ర. దొరక్క దొరక్క 65 ఏళ్లకు దొరికిన పాత్ర. తన నటనతో హ్యాట్సాఫ్ అనిపించారు. ఆయనకు జాతీయ అవార్డు వస్తుందా? ‘రంగమార్తాండ’ రీమేక్ సినిమా కాబట్టి ఆ అవకాశం లేదు. ఇప్పటిదాకా కామెడీలోనే కింగ్ అనిపించుకున్న ఆయనకు మలివయసులో ఈ పాత్ర దొరకడం భాగ్యమే! ఈ పాత్ర నేను చేయాలా అని బ్రహ్మానందం గారు అనుకున్నా, ఈ పాత్ర ఆయన చేత చేయించాలా అని దర్శకుడు కృష్ణవంశీ గారు భావించినా కథ వేరేలా ఉండేది.

నటులకు పాత్రలు దొరకడం ముఖ్యం. నటన వచ్చిన వారికి దొరకడం మరీ మరీ ముఖ్యం. బ్రహ్మానందం గారికి ఇన్నాళ్లకు ఆ అవకాశం దొరికింది. ‘రంగమార్తాండ’లో లోపాలు ఉంటే ఉండనీ, కానీ ‘చక్రపాణి’ పాత్ర బ్రహ్మానందం చేత చేయించిన కారణానికి తెలుగు ప్రేక్షకులు కలకాలం ఈ సినిమాను గుర్తుపెట్టుకుంటారు. గుర్తు పెట్టుకోవాలి. బ్రహ్మానందం గారి కోసం!