సూపర్ స్టార్ మూవీ వాయిదా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో సినిమా మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని భావించిన చిత్ర యూనిట్.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి చిత్రాల విడుదలకు లైన్లో ఉండటంతో.. నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 1 వ తేదిన విడుదల చేస్తామని ప్రకటించింది. తాజాగా కథానాయకుడు మహేశ్‌బాబు తోపాటు, నటి కీర్తిసురేశ్‌ కరోనా బారిన పడటంతో మూవీని మరోసారి వాయిదా వేయాలన్నది నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ పరిస్థితులన్నీ చక్కబడి సినిమా చిత్రీకరణ పూర్తయితే ఆగస్టు 5న విడుదల చేయాలని దర్శక-నిర్మాతలు యోచిస్తున్నారట. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
కాగా సర్కార్ వారిపాట చిత్రాన్ని పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. గీత గోవిందం లాంటి సంచలన బ్లాక్‌బస్టర్ తర్వాత పరశురామ్ దాదాపు మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని సినిమా చేస్తున్నాడు.

Optimized by Optimole