SwamiVivekanand: స్వామి వివేకానంద హుక్కా తాగేవారా..?

సాయి వంశీ: ( వివేకానందుడు తాగిన హుక్కా..!)

స్వామి వివేకానంద పొగతాగడాన్ని చాలా ఇష్టపడేవారు. తీర్థయాత్రలు చేసే సమయంలో, వీధుల్లో నడుస్తున్నప్పుడు, ఖాళీ సమయాల్లో పొగతాగడం ఆయనకు ఉపశమనంగా ఉండేది.

ఒకరోజు సాయంత్రం ఉత్తర భారతదేశంలోని ఓ వీధిలో ఆయన నడుస్తూ ఉండగా ఒక గుడిసెలో ఒక వృద్ధుడు హుక్కా తాగుతూ కనిపించాడు. ఆయనకు దాన్ని తాగాలని చాలా కోరిక కలిగింది. ఒకసారి ఆ హుక్కాను తనకిమ్మని ఆ వృద్ధుణ్ని అడిగారు.

దానికా వృద్ధుడు సమాధానం ఇస్తూ ‌”అయ్యా! నేనో పాకీవాణ్ని. అంటరానివాణ్ని. మిమ్మల్ని చూస్తే చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన మనిషిలాగా ఉన్నారు. నేను తాగిన హుక్కా మీరెలా తాగుతారు?” అన్నాడు. “నిజమే! నువ్వు తాగిన హుక్కా నేను తాగలేను” అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి వివేకానందుడిలో అశాంతి నెలకొంది.

“నేను ఇంతకాలం నేర్చుకున్నదేమిటి? నేను చేసిందేంటి? ప్రతి మనిషిలో శివుడు ఉంటాడని నా గురువు రామకృష్ణ పరమహంస చెప్పారు. నేను ఇప్పుడు సన్యాసిని. సర్వసంగ పరిత్యాగిని. అయినా నాలో ఈ భేదభావాలు ఎందుకు? శూద్రులు, దళితులు మాత్రం దైవసంతానం కాదా? ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్న భావం నాలో ఎలా వచ్చింది?” అనుకుని వెంటనే ఆ వృద్ధుడి దగ్గరకు తిరిగి వెళ్లి అతణ్ని మళ్లీ అడిగి హుక్కా తీసుకుని తాగారు.

“ఇప్పుడు నాకు రెండు విషయాలకు సంతోషంగా ఉంది. నా చిరకాల కోరికైన హుక్కా తాగడం నెరవేరింది. ఈ ప్రపంచంలో అందరూ సమానమే అన్న విషయాన్ని నీ హుక్కా తాగడం ద్వారా నేను గ్రహించాను” అని అతనితో చెప్పారు.

(Indian Spiritual Leader ‌’Sri Chinmoy'(Chinmoy Kumar Ghose) రాసిన “Great Indian meals: Divinely delicious and Supremely Nourishing, Part 5” పుస్తకంలో రాసిన అంశాలు)

Optimized by Optimole