Chandrababu: గత ఎన్నికల్లో స్వలాభం కోసం చెల్లిని, తల్లిని ఉపయోగించుకున్న జగన్ ఇప్పుడు వారు నీ నుంచి ఎందుకు దూరమయ్యారని?తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిలదీశారు. పులివెందుల కల్చర్.. కడప కల్చర్.. రాయలసీమ కల్చర్ ను.. కొత్తగా తనను మేము ఎగతాళి చేస్తున్నామని నాటకమాడుతున్నాడని మండిపడ్డారు. తాను కూడా రాయలసీమ వాసినేనని ..మేమెందుకు నిన్న ఎగతాళి చేస్తామని అన్నారు. ఇంట్లోని కుటుంబ కలహాలు, గొడవలు మన మీద నెట్టేసి సానుభూతి పొందాలన్నదే జగన్ కుట్రగా ఆయన అభివర్ణించారు. జగన్ ఇంట్లోని గొడవలు రాష్ట్ర గొడవలు కాదని… మీరు తేల్చుకోవాల్సిన తగాదాలు రాష్ట్ర ప్రజలకీ అవసరం లేదని తేల్చిచెప్పారు. గురువారం రాత్రి రైల్వే కోడూరులో నిర్వహించిన వారాహి విజయభేరీ యాత్ర సభలో పవన్ కళ్యాణ్ , ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘ వైఎస్ రాజశేఖరరెడ్డి, వివేకానంద రెడ్డి రామలక్ష్మణులు మాదిరి ఉండేవారన్నారు. వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించింది భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలని అన్నారు. కావాలని వారి రాజకీయ ఎదుగుదలకు అడ్డు వస్తున్నారనే ఆయనను అప్పట్లో ఎమ్మెల్సీగా ఓడించారన్నారు.కడప ఎంపీ సీటును తనకు ఇవ్వాలని, కుదరకపోతే షర్మిలకు ఇవ్వాలని వివేకానంద రెడ్డి అడిగితే చంపేశారని ఆరోపించారు. అన్నలు, చెల్లెళ్లు, అక్కలు, బామ్మలు అని తియ్యగా మాట్లాడుతూ ఘోరంగా దగా చేసే వ్యక్తి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్య మాట విని, కన్నతల్లిని దూరం పెట్టిన వ్యక్తి జగన అని చంద్రబాబు పేర్కొన్నారు.