టీమిండియా కెప్టెన్ మార్పుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టుకు కెప్టెన్సీ మార్పు మంచిది కాదని ఆప్రభావం కోహ్లీ ఆటతీరుపై పడుతుందని, ఇది భారత క్రికెట్ సంస్కృతికి విరుద్ధమని హెచ్చరించాడు. క్రికెట్లో ఎంతపెద్ద ఆటగాడికైనా ఒడిదుడుకులు సహజమని అంతమాత్రాన అతని శక్తి సామర్ధ్యాలను శంకించడం సబబు కాదని హితువు పలికాడు.
ఆస్ట్రేలియా టూర్లో అతని సారధ్యంలో జట్టు వన్డే సిరీస్ కోల్పోవడం, అడిలైడ్ టెస్టులో అత్యల్పంగా 36 పరుగులకే జట్టు ఆలౌట్ అయిన తీరు పట్ల కోహ్లి కెప్టెన్సీ పై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం వ్యక్తిగత సెలవులపై మిగతా మూడు టెస్టులకు రహానే సారధ్యంలో టెస్ట్ సిరీస్ గెలవడం తెలిసిన విషయమే. సీనియర్ల గైర్హాజరిలో రహానే జట్టును నడిపిన తీరుపట్ల మాజీ క్రికెటర్లు, పలువురు ఆటగాళ్లు కెప్టెన్సీ మార్పు అంశాన్ని లేవనెత్తారు.
ఇక కెప్టెన్సీ మార్పు విషయమే జట్టులోని ఓ ఆటగాడు స్పందిస్తూ కెప్టెన్గా , ఆటగాడిగా కోహ్లీకి తిరుగులేదని, ఒకటి రెండు సిరీస్లకే ఓ అభిప్రాయానికి రావడం మంచిది కాదని.. ఆటలో గెలుపోటములు సహజమని పేర్కొన్నాడు.