కరీంనగర్ కాషాయమయం..పాదయాత్ర ముగింపు సభ గ్రాండ్ సక్సెస్..

బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ పట్టణం కాషాయ రంగు పులుముకుంది. పట్టణంలో ఎక్కడ చూసిన బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.  సభా  వేదిక…SRR కాలేజ్ ప్రాంగణం భారత్ మాతాకీ జై నినాదాలతో దద్దరిల్లింది. వేదికపై కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సింగర్ లక్ష్మి గానానికి అనుగుణంగా కాషాయం కార్యకర్తలు తమదైన  స్టెప్పులతో అదరగొట్టారు. ఇక సభ ప్రారంభం కాగానే..  బిజెపి నేతలు  సీఎం కేసిఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ మట్టికి మొక్కి.. ప్రజల ఆశీర్వాదంతో…కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టడమే లక్ష్యంగా … ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను ఇక్కడ పెట్టామని కుండ బద్దలు కొట్టారు. ఆరు నూరైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.

 

కాగా పాదయాత్ర ముగింపు సభ లో బండి సంజయ్ కేసిఆర్ పై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి లో తెలంగాణను తీసేసిండని..రాష్ట్రంతో బంధం తొలగించుకున్నాడని.. దీంతో  కేసీఆర్ పీడ విరగడయిందని సంజయ్ ఆరోపించారు. తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని.. BRS పేరుతో దేశాన్ని దోచుకుందామని చూస్తున్నాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు. దందాలు, కబ్జాల పేరుతో… లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నాడని..లిక్కర్, స్యాండ్, గ్రానైట్, డ్రగ్స్… ఇలా అన్ని దందాలు, స్కామ్ లు వాళ్ళవేని తేల్చిచెప్పారు. 24 గంటలు మోడీ ని తిడుతూ…ఏపీతో కుమ్మక్కై, సెంటిమెంట్ రగిల్చి.. రాజకీయ లబ్ది పొందాలని కేసిఆర్ చూస్తున్నాడని మండి పడ్డారు. తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే… నిలువ నీడలేని పేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తామని..  ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇచ్చే ప్రభుత్వం కావాలా..? వద్దా? అని సంజయ్ ప్రశ్నించారు.

ఇక ప్రజా  సంగ్రామ యాత్ర ముగింపు సభ  సందర్భంగా  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్.. కేసిఆర్ పై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మొదలు పెట్టినప్పుడు..  శ్రీరామ రక్ష.. మానవ అద్భుతమన్న కేసీఆర్… గత 4 నెలలుగా అక్కడికి చీమను కూడా ఎందుకు పోనివ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల రక్తపు చుక్కల మీద లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే… మొన్నటి వరదకి, మోటార్ లు మునిగిపోయాయని అన్నారు. కన్నెపల్లి పంపు హౌజ్ లో 18.. అన్నారం లో 12 పంపులు మునిగిపోయాయన్నారు. తాను చెప్పేది తప్పైతే… SRR కాలేజ్ గ్రౌండ్ కి వచ్చి కేసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మార్పుకు నాంది..డబ్బులకు ఎదురొడ్డిన జిల్లా కరీంనగర్ అని కొనియాడారు. 2006లో డబ్బులతో నాయకులను కొన్నా…  హుజురాబాద్ ఉప ఎన్నికలో 4000 కోట్లు ఖర్చు పెట్టినా… చైతన్య ప్రజలు నన్ను గెలిపించారని ఈటల పేర్కొన్నారు.

అటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం టీఆర్ఎస్ నేతల్ని ఏకిపారేశారు. ఎలక్షన్స్ రాకముందే.. టిఆర్ఎస్(BRS)పార్టీని పంపించేశారని.. తెలంగాణ జాగృతి… ఇప్పుడు భారత్ జాగృతి అయిందంటని ఎద్దేవా చేశారు.BRS గా TRS ని మార్చింది కాంగ్రెస్ తో కలిసేందుకేనని అరవింద్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ అనేటోడు… సాఫ్ట్వేర్ వాళ్ళతో, బాలీవుడ్ వాళ్ళతో తిరుగుతూ.. నైట్ పార్టీలతో జల్సాలు చేస్తాడని అన్నారు. లిక్కర్ లేడి నా ఇంటిపైకి గుండాలను పంపిందని.. కవిత తలుచుకుంటే… మైక్ టైసన్ కు బాక్సింగ్, విరాట్ కోహ్లీ కి క్రికెట్ నేర్పుతాదని వ్యాఖ్యానించారు

………

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఫొటోస్ …

 

Optimized by Optimole