కొత్త భాష్యం చెబుతున్న ‘ఎర్రగులాబీలు’

ప్రత్యేక వ్యాసం:

డా.గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ,ప్రముఖ్‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర

__________________

కొత్త భాష్యం చెబుతున్న ‘ఎర్రగులాబీలు’

మునుగోడు నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా నినదించిన పోరుగడ్డ. గతంలో ఐదుసార్లు ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఉప ఎన్నికలో పొంతనలేని సాకులు చెప్పి టీఆర్‌ఎస్‌ పంచన కమ్యూనిస్టులు చేరారు. ప్రగతిశీల శక్తులు కలిసి పనిచేయాలంటూ కొత్త భాష్యం చెబుతున్నారు. 

టీఆర్‌ఎస్‌ ప్రగతిశీల పార్టీ ఎట్లా అవుతుందో కమ్యూనిస్టు మేధావులు చెప్పాలి. గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో ఏ ప్రజాస్వామ్య సమస్యపైనా ఏ పార్టీ, ప్రజాసంఘాలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వనందుకా? తమ హక్కుల కోసం పోరాడే ధర్నాచౌక్‌ (ఇందిరాపార్క్‌) ను నిషేధించినందుకా? తమ పత్రికలపై అప్రకటిత నిషేధం విధించి పత్రికలను ఆర్థికంగా నష్టపరిచినందుకా? ఏ విషయంలో కేసీఆర్‌లో ప్రజాస్వామిక లక్షణాలు కనబడ్డాయో ప్రజలకు కమ్యూనిస్టులు జవాబు చెప్పాల్సిందే. చివరకు కమ్యూనిస్టు పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేను ప్రలోభపెట్టి  టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నందుకా? టీఆర్‌ఎస్‌ ప్రగతిశీల పార్టీ ఎట్లా అవుతుంది?

విధానాల్లో తీవ్ర వైరుధ్యం..

సిద్ధాంతరీత్యా కూడా తప్పులు చేయడం, తరువాత చెంపలేసుకోవడం కమ్యూనిస్టులకు ఒక రివాజుగా మారింది. గతంలో ప్రధానమంత్రి పదవి తీసుకోకపోవడం ఒక చారిత్రక తప్పిదమని జ్యోతిబసు అన్నారు. ఇటీవల విశాఖ, హైదరాబాద్‌ అఖిలభారత సభల్లో, కన్నూర్‌ సభల్లో చేసిన తీర్మానాల్లో కూడా మహాసభకు  మహాసభకు మధ్య కమ్యూనిస్టుల విధానాల్లో తీవ్ర వైరుధ్యం ఉన్నది. 

బిజెపి ఓటమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటిస్తున్న వామపక్షాలు అదే సమయంలో రాష్ట్రంలో ప్రజాసమస్యలపై పోరాడుతాము అంటున్నారు. ఒక పక్క మద్దతిస్తూ మరోపక్క పోరాడుతామంటే ప్రజలు ఎలా నమ్ముతారు? వామపక్షాలు తనదృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని కేసీఆర్‌ మునుగోడు బహిరంగసభలో ప్రకటించారు. ఆ సమస్యలు ఏవో వారు ఉభయులు బహిర్గతం చేయలేదు. కమ్యూనిస్టులు  ఏ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారనే లోగొట్టు పెరుమాళ్లకే ఎరుక. గతంలో ఇదే కమ్యూనిస్టులను తోక పార్టీలుగా, గుండుసూదుల పార్టీలుగా, దబ్బనం పార్టీలుగా కేసీఆర్‌ పోల్చిన విషయం కమ్యూనిస్టు సానుభూతి పరులెవరో మర్చిపోయుండరు. బహుశా కమ్యూనిస్టులు నేల విడిచి సాము చేయడం వలనే ఇట్లా ఉండొచ్చు. 

కమ్యూనిస్టులు ఒకసారి కాంగ్రెస్‌తో ఎటువంటి అవగాహన ఉండదంటారు. మరోసారి అదే నిఖార్సయిన లౌకిక పార్టీ అంటారు. పశ్చిమ బెంగాల్‌లో అదే కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. మరోసారి ప్రాంతీయ పార్టీలు అవకాశవాదంతో వ్యవహరిస్తాయని చెబుతాను. ప్రాంతీయపార్టీగా ఉన్నా తెలుగుదేశంతో సుదీర్ఘకాలం పొత్తులో ఉండటమే తప్పని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటారు. ఇప్పుడు అదే ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు ఉభయ కమ్యూనిస్టులు పోటీపడుతున్నారు. పచ్చి మతతత్వ ఎం.ఐ.ఎంతో అంటకాగే టీఆర్‌ఎస్‌ ఎలా లౌకికపార్టీ అవుతుందో వామపక్ష శ్రేణులు ఆలోచించాలి. లౌకికవాదం ముసుగులో  టీఆర్‌ఎస్‌ పల్లకి మోసేందుకు సిద్ధపడిన ఉభయ కమ్యూనిస్టులు సిగ్గుపడాలి. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో  మండలాల వారీగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. విధాన పరమైన ఏ నిర్ణయమైన రాష్ట్ర పార్టీలే నిర్ణయిస్తాయి. ఒక శాసనసభకు జరిగే ఉప ఎన్నికలో ఇటువంటి సైద్ధాంతిక గందరగోళ నిర్ణయాలతో కార్యకర్తలను వామపక్షాలు అయోమయానికి గురిచేస్తున్నారు. 

సైద్ధాంతిక బలమే ఆయుధంగా చెప్పుకునే వామపక్షాలు త్రిపురలో బిజెపి దెబ్బకు మట్టికరిచాయి. బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి అవతరించింది.  నేడు మునుగోడు సహా తెలంగాణ రాష్ట్రంలో అదే పునరావృతం కాబోతుంది. 

అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌ది..

ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌ది. కానీ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు కనీసం సమయానికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి, ఇక పెన్షనర్ల ఇబ్బందులు అంతా ఇంతా గాదు. ముందే చెప్పినట్లు బిజెపి ఆందోళనలు, రాజగోపాలరెడ్డి రాజీనామా తరువాతే కేసీఆర్‌కు ప్రజాసంక్షేమం గుర్తుకు వస్తోంది. చేనేతబీమా అయినా, కొత్తగా రాష్ట్రంలో 10 లక్షల ఆసరా ఫించన్లయినా బిజెపి పోరాటం వల్ల ప్రకటించినవే. 

మునుగోడులోనే కాదు, భవిష్యత్‌లో జరగబోయే శాసననభ ఎన్నికల్లోనూ బిజెపి విజయం సాధిస్తుంది. అది ఒక చారిత్రక  అవసరం. ఇప్పటివరకు సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌, టిడిపిలు రాష్ట్రాన్ని పాలించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ కూడా ప్రజలకు ఒరగ బెట్టింది ఏమీ లేదు. ప్రజలు ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నారు. ప్రత్యామ్నాయ రూపంలో బిజెపి తెలంగాణలో సకల జనులకు కనబడుతుంది. బిజెపికి ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞులైన తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. 

‘‘తెలంగాణ గడ్డపైన దండు పుట్టిందిరో … తెలంగాణ వచ్చినా మా గోస తీరలేదురో’’..

టీఆర్‌ఎస్‌ నియంతృత్వ, అప్రజాస్వామిక, కుటుంబపాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. ‘‘తెలంగాణ గడ్డపైన దండు పుట్టిందిరో … తెలంగాణ వచ్చినా మా గోస తీరలేదురో’’ అంటూ బిజెపి తెలంగాణ శాఖ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో చేస్తున్న ప్రచారం తెరాస నాయకుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. తెలంగాణ ప్రజల గోస తీరాలంటే వారిముందున్న ప్రత్యామ్నాయం బిజెపి పార్టీనే.  చైతన్యవంతమైన మునుగోడు ప్రజలే అందుకు ముందు భాగాన నిలవాలి. అవినీతి, అక్రమాలతో రాష్ట్ర ఖజానాను లూఠీ చేసిన కల్వకుంట్ల కుటుంబానికి చెంపచెల్లుమనిపించేలా సమాధానం చెప్పే చక్కటి అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చింది.

 

Optimized by Optimole