Telangana:ఉద్యమ నిబద్ధతతో బీఎస్పీకి నూతన జవసత్వం

Telangana:

తెలంగాణ రాజకీయాల్లో నాయకులు అనేక మంది వస్తుంటారు, వెళ్తుంటారు. అయితే సమాజ మార్పు కోసం, అణగారిన వర్గాల రాజకీయ సాధికారత కోసం తమ జీవితాన్ని అంకితం చేసే నాయకులు మాత్రం అరుదుగా కనిపిస్తారు. అలాంటి నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్.

బహుజన సమాజం రాజకీయంగా బలపడకపోతే సామాజిక న్యాయం అసంపూర్ణంగానే మిగిలిపోతుందనే నమ్మకంతో ఆయన రాజకీయ ప్రయాణం సాగుతోంది. రాజకీయ అధికారమే సామాజిక మార్పుకు మూలాధారమని బీఎస్పీ వ్యవస్థాపకుడు మన్యవర్ కాన్షీరాం ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇబ్రాం శేఖర్ ప్రత్యేక కృషి చేస్తున్నారు.

సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ స్థాయిల వరకు విస్తరించింది. ప్రజాప్రతినిధిగా వివిధ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనకు ప్రజల సమస్యలపై లోతైన అవగాహనను అందించింది. బహుజన రాజకీయాలకు, మహానీయుల ఆశయాలకు ప్రతిరూపంగా ఆయన తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారు.

చిన్ననాటి నుంచే ఉద్యమ చైతన్యం, సామాజిక బాధ్యతలను తన అన్న ఇబ్రాం మైసన్న నుంచి అలవర్చుకున్న ఇబ్రాం శేఖర్, ఆ విలువలనే తన రాజకీయ జీవితానికి పునాదిగా మలుచుకున్నారు. అందుకే ఆయనకు రాజకీయాలు వ్యక్తిగత ఎదుగుదలకు సాధనం కాకుండా, కాన్షీరాం ఆశయాల సాధనకు మార్గంగా మారాయి.

బహుజన్ సమాజ్ పార్టీని కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితం చేయకుండా, సామాజిక మార్పు కోసం పనిచేసే ఉద్యమ వేదికగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరిలో ఉద్యమ చైతన్యాన్ని నింపేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.

కాన్షీరాం చెప్పిన “రాజకీయ అధికారం అన్ని సమస్యలకు పరిష్కారం” అనే సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రజల్లో బలంగా నాటేందుకు ఆయన విశేషంగా శ్రమిస్తున్నారు. బహుజనులు తమ ఓటు శక్తిని గుర్తించి, తమ రాజకీయ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ నిర్మాణం, యువతలో రాజకీయ అవగాహన, బూత్ స్థాయి బలోపేతం, సామాజిక చైతన్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాన్షీరాం జీవిత చరిత్రకు సంబంధించిన వేలాది పుస్తకాలను పంపిణీ చేసి ఉద్యమ భావజాలాన్ని విస్తరించారు.

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా 2025 ఆగస్టు 28న బాధ్యతలు స్వీకరించిన ఇబ్రాం శేఖర్ ఏడాది కాలంలో పార్టీ విస్తరణకు విశేష కృషి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కమిటీల నిర్మాణం, బూత్ మరియు సెక్టార్ స్థాయి సంస్థాగత బలోపేతం ద్వారా పార్టీని గ్రామగ్రామాన విస్తరించేందుకు కృషి చేస్తున్నారు.

ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధించిన ముఖ్య విజయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ ఎన్నికల గుర్తు ‘ఏనుగు’ను అందుబాటులోకి తీసుకురావడం ఒకటి. రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఏనుగు గుర్తు నమోదు చేయించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులు పార్టీ గుర్తుతో పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. దీని వల్ల పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులు గణనీయమైన ఓట్లు సాధించడమే కాకుండా, గ్రామ పంచాయతీలు, వార్డులు, కార్పొరేషన్లలో విజయాలు నమోదు చేయడం పార్టీ బలోపేతానికి సంకేతంగా భావిస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై కార్పొరేటర్లను గెలిపించుకోవడం బీఎస్పీకి నూతన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

పార్టీ చీఫ్ సెక్టార్ కోఆర్డినేటర్లు ఆథర్ సింగ్, సురేష్ ఆర్యల మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీని బలోపేతం చేసే దిశగా ఇబ్రాం శేఖర్ పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించేలా పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేయడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణకు స్పష్టమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

జనాభా ప్రాతిపదికన బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడం, స్థానిక సంస్థల్లోనూ, పార్టీ నిర్మాణంలోనూ సముచిత భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేసే దిశగా పార్టీని సిద్ధం చేస్తున్నారు.

తెలంగాణలో బహుజన రాజకీయాల గురించి చర్చ జరిగినప్పుడు ఇబ్రాం శేఖర్ పేరు ప్రస్తావనకు రావడం యాదృచ్ఛికం కాదు. అది ఆయన ఉద్యమ నిబద్ధతకు, క్రమశిక్షణకు, అంకితభావానికి నిదర్శనం. వ్యక్తిగత ప్రయోజనాల కంటే బహుజన సమాజ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్న ఆయన, తెలంగాణలో బహుజన రాజకీయాలకు కొత్త ఆశగా ఎదుగుతున్నారు.

ఇంటింటికీ ఏనుగు గుర్తును, గడపగడపకూ బీఎస్పీ సిద్ధాంతాన్ని తీసుకెళ్లాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న ఇబ్రాం శేఖర్ నాయకత్వంలో తెలంగాణలో బహుజన ఉద్యమం మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఆయన రాజకీయ ప్రయాణం బహుజన సాధికారత కోసం సాగుతున్న ఉద్యమానికి కొత్త దిశను చూపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

_వినోద్ (జర్నలిస్ట్)

Optimized by Optimole