తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు వ్యూహాలతో ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఏకంగా ఆపార్టీ వ్యవహరాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేయడం.. ఇది చాలదన్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధిష్టానానికి లేఖరాశారంటూ వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇక తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి.. పీసీసీ రేవంత్ , మాణిక్యం ఠాగూర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలానికి పార్టీని నడిపిస్తున్న, పర్యవేక్షణ చేస్తున్న వారే కారణమంటూ మండిపడ్డారు.మాణిక్కం ఠాగూర్ ..రేవంత్‌రెడ్డి చేతిలో కీలుబొమ్మలా మారరని..అతను చెప్పినట్లు ఆడుతున్నాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంతో రేవంత్ వ్యవహరించిన తీరు సరిగ్గాలేదన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్‌కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని శశిధర్ రెడ్డి దుయ్యబట్టారు.
కాగా, మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై ఆపార్టీ నేత అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు. పీసీసీ రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌పై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని.. పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడటం సరికాదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలకు కాంగ్రెస్ పావుగా మారుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. పీసీసీని అంటే పార్టీకి నష్టమని.. ఏదైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. రేవంత్ చెబితే స్పందించడం లేదని.. తనపై కామెంట్ చేశారు కాబట్టే స్పందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు పట్ల కలత చెందుతున్నట్లు దయాకర్ వెల్లడించారు.
తాజాగా కాంగ్రెస్ ఏఐసీసీ పొగ్రామ్స్ ఇన్ చార్జ్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ వారిపై అధిష్టానానికి లేఖ రాశారని పార్టీల్లో జోరుగా ప్రచారం జరగుతోంది. ఏడాదిన్నరగా పార్టీ కోసం చేపట్టిన కార్యక్రమాలపై మాణిక్యం రాగూర్ కు వివరిస్తే ..ఆయన వినకపోగా అందరి ముందు అవమానించడంతో మనస్తాపం చెందిన మహేశ్వర్ రెడ్డి లేఖ లో పేర్కొనట్లు తెలిసింది. ఈ క్రమంలో రేవంత్, ఏఐసీసీ సెక్రెటరీ నదీమ్ జావెద్ ఆయనకు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.
ఓవైపు పార్టీ నుంచి వలసలు .. మరోవైపు నేతల అంతర్గత కుమ్ములాటలతో హస్తం పార్టీ కొట్టుమిట్టాడుతోంది. రేవంత్ , మాణిక్యం ఠాగూర్ వైఖరిపై సీనియర్ నేతలు బుస కోడుతుంటే .. మరోవైపు పార్టీపై అలక వీడిన ఎంపీ కోమటిరెడ్డి.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అపాయిమెంట్ కోరడం.. అధిష్టానం ఆదేశిస్తే మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలు చేపట్టడానికి రెడీ అనడం చూస్తుంటే.. ఉప ఎన్నిక లాభామా?నష్టమా? అన్న కొత్త చర్చకు తావిచ్చింది.