డబుల్ ఇంజిన్ సర్కారుతో తెలంగాణ అభివృద్ధి పరుగులు : పవన్ కళ్యాణ్

telanganaelections2023: ‘అధికారం, ఆర్థిక వనరులు తెలంగాణలో అన్ని వర్గాలకు సమానంగా అందాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా సిద్దించిన తెలంగాణలో సామాజిక న్యాయం ఎంతో అవసరం. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న బీసీలను తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తామని, అదే లక్ష్యమని ప్రకటించిన బీజేపీ ఆలోచనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అందరికీ అధికారం అందినపుడే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంద”ని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గ ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్  పాల్గొన్నారు. ఈ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా  నేమూరి శంకర్ గౌడ్ పోటీ చేస్తున్నారు.


ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ ‘‘పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ. ఇక్కడ ప్రతి అణువులోనూ ఆశయం దాగి ఉంటుంది. దేనికీ భయపడకుండా, కష్టానికి వెరవకుండా ముందుకు సాగే యువత తెలంగాణలోనే ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమం స్ఫూర్తితోనే నేను ఆంధ్రప్రదేశ్ లోనూ రౌడీ మూకలతో పోరాడగలుగుతున్నాను. ఈ నేల, గాలి ఇచ్చిన ధైర్యంతోనే రాజకీయాల్లో ముందడుగు వేయగలుగుతున్నాను. బండెనక బండి కట్టి అంటూ ప్రజా యుద్ధ నౌక శ్రీ గద్దర్ అన్న పాడిన పాటలే నా రాజకీయ అడుగులకు స్ఫూర్తి. తెలంగాణ అభివృద్ధి దశలో ముందుకు వెళ్లడానికి జనసేన పార్టీ పనిచేస్తుంది. నాకు పదవులు మీద ఆశ, అధికారం మీద ప్రేమ అనేవి లేవు. నాకు పునర్జన్మనిచ్చిన తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాను. బీజేపీ ప్రస్థానంలో 31 మంది బీసీ వర్గాలకు చెందిన వారిని ముఖ్యమంత్రులుగా చేశారు. బీసీ వర్గానికి చెందిన శ్రీ నరేంద్ర మోదీ గారి పాలనలో దేశం ముందుకు దూసుకువెళ్తోంది.తమ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయని 16 ఏళ్ల శివ అనే యువకుడు నా దగ్గరకు వచ్చి పోరాడాలని కోరడం ఇప్పటికీ నాకు స్ఫూర్తి నింపుతుంది. ఇక్కడి యువతలో పోరాడే తత్వం, తప్పు జరిగితే ప్రశ్నించే తత్వం నన్ను కదిలిస్తుందని పవన్ పేర్కొన్నారు.


మోదీ  నాయకత్వంలో దేశం పరుగులు తీస్తోంది..
ప్రపంచంలోనే 5వ అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగల దేశంగా భారతదేశం ఎదిగిందన్నారు పవన్. బీసీలకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్లను విడుదల చేసి, వారి అభ్యున్నతికి ఖర్చు చేయడం సామాన్య విషయం కాదన్నారు. అలాగే రూ.43 వేల కోట్లను కేంద్రం తెలంగాణ కోసం ఇచ్చిందన్నారు.అన్ని విధాలుగా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తోంది. ఉగ్రవాదాన్ని దేశం నుంచి రూపుమాపడంలోనే కాదు.. మా దేశంలోకి వచ్చి మీరు దాడులు చేస్తే, మీ ఇళ్లలోకి వచ్చి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని శత్రుదేశాలకు గట్టి హెచ్చరికలు పంపేలా బీజేపీ పని చేస్తోందని పవన్ స్పష్టం చేశారు.

Optimized by Optimole