రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు తాత్కాలిక సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు శాసనసభలో ఆమె ప్రకటన చేశారు.
‘‘దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోంది. మన రాష్ట్రంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదీ ఇలాగే కొనసాగితే కరోనా తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలను మూసివేశాయి. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.