పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణా సర్కార్. భీమ్లానాయక్ చిత్రానికి రెండు వారాల పాటు ఐదు షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో థియేటర్లు వారం రోజుల పాటు బుక్ కావడంతో పాటు.. టికెట్స్ హాట్ కేక్ లా అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. అటు పవన్ అభిమానులు.. భీమ్లానాయక్ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏపీ ప్రభుత్వం భీమ్లానాయక్ విడుదల సందర్భంగా.. రాష్ట్రంలోని థియేటర్లకు ముందస్తు నోటీసులు జారీ చేసింది. సినిమాకు బెనిఫిట్ షో, అదనపు షోలు వేయరాదని ఆ నోటీసుల్లో పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని థియేటర్ల యజమానులను హెచ్చరించింది. టికెట్ రేట్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని.. థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని నోటీసులో పేర్కొంది.
మరోవైపు ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పవన్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా పవన్ ప్రభంజనాన్ని ఆపలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.