మునుగోడు బైపోల్ ప్రచారాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి.ఇటు బీజేపీ గొల్ల కుర్ముల పేరిట ఆత్మీయ సమావేశం నిర్వ హించి..చేరికలతో కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపంగా.. అటు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. పీసీసీ రేవంత్ రోడ్ షోలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు.ఇక అధికార టీఆర్ఎస్ మంత్రులు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పర్యటించి ప్రచారంతో పాటు చేరికలను వేగవంతం చేశారు.
కాగా బీజేపీ చౌటుప్పల్ లో గొల్ల కుర్ముల ఆత్మీయ సమావేశం నిర్వహించింది.ఈకార్యక్రమానికి కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు భూపేంద్ర యాదవ్. రాష్ట్రం ఏర్పడితే ఒక కుటుంబ మాత్రమే బాగుపడిందన్నారు.తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. ఆ మార్పు తెచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు. రాష్ట్రంలో ప్రతి పల్లెలో అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందేలా బిజెపి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.దళిత బంధు ప్రచారానికి మాత్రమే పరిమితమైందని.. ప్రజలను మభ్య పెట్టడానికే పథకాలు తీసుకొస్తున్నారని.. వారి అభివృద్ధి కోసం కాదని భూపేంద్ర యాదవ్ తేల్చిచెప్పారు.
ఇక మునుగోడు నియోజకవర్గం చౌటుపల్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.చౌటుపల్ మండలం కొయ్యలగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఎవరైనా పార్టీ మారాలని బెదిరిస్తే..వీపు విమానం మోత మోగూతుందని ఘాటుగా హెచ్చరించారు.ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన నేతలు పశువుల సంత మాదిరి అమ్ముడుపోతున్నారని మండిపడ్డారు.గతంలో పేదల కోసం కాంగ్రెస్ చేసిన పనులను గుర్తు చేసుకోవాలని సూచించారు. మభ్య పెట్టే నేతలకు తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్ హితువు పలికారు.
ఇదిలా ఉంటే.. అధికార టీఆర్ఎస్ మంత్రులు ,ఎమ్మెల్యేలు గ్రామాల వారిగా క్యాంపెయిన్ నిర్వహించారు. బిజెపి కి ఓటు వేయడం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ఉచిత విద్యుత్ కు మంగళం పాడుకోవడమేనని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈక్రమంలోనే గట్టుప్పుల్ మండల కేంద్రానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ కు చెందిన నేతలు జగదీష్ రెడ్డి సమక్షంలో టి ఆర్ఎస్ లో చేరారు. ఉప ఎన్నికల్లో టి ఆర్ యస్ అభ్యర్థి గెలిస్తే.. మూడేండ్ల నుంచి పేరుకు పోయిన సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయని మంత్రి స్పష్టం చేశారు.
మొత్తంమీద మూడు ప్రధాన పార్టీలు ఢీ అంటే ఢీ తరహాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.ఇటు పార్టీ నేతలు.. చేరికల పై దృష్టి సారిస్తూనే మాటల తూటాలు పేలుస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు.